అంత్యక్రియలు: మోదీ, జైట్లీకి స్వీట్స్
బెంగళూరు : పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల్లో నగదు కొరతపై జనతాదళ్ నాయకులు కర్ణాటకలో వినూత్నంగా నిరసనకు దిగారు. ఒకవైపు జనతా దళ్ యునైటెడ్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ కు పరోక్షంగా మద్దతుఅందిస్తోంటే, జేడీ (యు) లోమద్దతుదారులు ఇందుకు విరుద్ధంగా స్పందించారు. జేడీయూ కార్యకర్తలు, స్థానికులు సమీపంలోని ఒక ఏటీఎం మెషీన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మైసూర్ బ్యాంక్ సర్కిల్ లోని క్యాష్ లెస్ ఏటీఎం వద్ద ఈ ఆందోళన చేపట్టారు
ఒక నెల తరువాత కృత్రిమ శ్వాస పరికరాన్ని తొలగించడంతో ఏటీఎం తుదిశ్వాసం విడించిందనీ, అందుకే సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తున్నామని సామాజిక కార్యకర్త కుమార్ జాగీర్దార్ వ్యాఖ్యానించారు. ఏటీఎం ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుసు, మా డబ్బులు మేం తీసుకోవడానికే మా కు సాధ్యం కావడంలేదని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో నగదు లేదు. ఏ ఏటీఎం పనిచేయడంతో లేదు. తమ కనీస అవసరా తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేవు. పెద్ద నోట్ల రద్దు మానవహక్కుల ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. అందుకే నగదు లేని ఏంటీఎం కు అంత్యక్రియలు నిర్వహించి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రసాదం( స్వీట్స్) పంపించినట్టు చెప్పారు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే, కానీ సాధారణ ప్రజలు, రైతులు బాధల మాట ఏమిటి అని స్థానిక నేత సయ్యద్ మెహబూబ్ వ్యాఖ్యానించారు. గత 30 రోజులగా రోజువారీ అవసరాలకోసం ప్రజలు డబ్బు కోసం క్యూలు కడుతూనే వున్నారన్నారు. సుమారు 90 శాతం ఏటీఎంలు పనిచేయడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎపుడని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది జెడి (యు) కర్ణాటక ప్రతిపాదన అన్నారాయన.