
ఎస్‌బీఐ క్విప్ ఇష్యూకు ఎల్‌ఐసీ తోడ్పాటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) చేపట్టిన అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ఎల్‌ఐసీ అండతో విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎస్‌బీఐ రూ. 8,032 కోట్లను సమీకరించినట్లు సంబం ధిత వర్గాలు తెలిపాయి. క్విప్ ద్వారా రూ. 9,500 కోట్ల వరకూ సమీకరించేందుకు బ్యాంక్ బోర్డు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇష్యూలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 3,000 కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,000 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇష్యూలో భాగంగా షేరుకి గరిష్టంగా రూ. 1,629.35, కనిష్టంగా రూ. 1,565 ధరను బ్యాంక్ నిర్ణయించింది. అయితే అత్యధిక శాతం బిడ్స్ కనిష్ట ధరలోనే దాఖలైనట్లు తెలుస్తోంది. క్విప్ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 3.5% క్షీణించి రూ. 1,519 వద్ద ముగిసింది. క్విప్ తరువాత బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 62% నుంచి 58.6%కు పరిమితంకానుంది.