తల్వార్ దంపతులకు జీవితఖైదు | Life imprisionment awarded to talwars | Sakshi
Sakshi News home page

తల్వార్ దంపతులకు జీవితఖైదు

Published Wed, Nov 27 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

తల్వార్ దంపతులకు జీవితఖైదు

తల్వార్ దంపతులకు జీవితఖైదు

ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో దోషులుగా తేలిన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు మంగళవారం జీవితఖైదు శిక్ష విధించింది. జంట హత్యలకు సంబంధించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి దోషులకు ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ తరఫు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో వైద్య దంపతులు రాజేశ్(49), నూపుర్(48)లను కోర్టు సోమవారం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. శిక్ష ఖరారుపై మంగళవారం కేవలం ఐదు నిమిషాల పాటు వాదనలు సాగాయి.

అనంతరం అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు దంపతులిద్దరికీ మరో ఐదేళ్ల కారాగార శిక్ష, ఎఫ్‌ఐఆర్ నమోదు సందర్భంగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రాజేశ్‌కు అదనంగా మరో ఏడాది జైలు శిక్ష విధించారు.  ఈ కేసులో పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో జడ్జి ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్)పై ఆధారపడ్డారు. నేరం జరిగిన చోట పరిస్థితులను ఆధారంగా చేసుకొని పోలీసులు చెప్పిన 26 కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు సీబీఐ తరఫున ఆర్‌కే సైనీ వాదిస్తూ.. అత్యంత కిరాతకంగా ఇద్దరిని హతమార్చిన తల్వార్ దంపతులకు మరణశిక్షే సరైనదని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తల్వార్ దంపతుల తరఫున తన్వీర్ మిర్ వాదిస్తూ.. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని, అందువల్ల వారిపై దయ చూపాలని కోరారు.


 ఏయే సెక్షన్ల కింద శిక్షలు..
 ఐపీసీ సెక్షన్ 302(హత్య), 201(సాక్ష్యాల ధ్వంసం), 34(ఉమ్మడి నేర లక్ష్యం) కింద రాజేశ్, నూపుర్ దంపతులకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీటితోపాటు పనిమనిషి హేమ్‌రాజే తన కూతురు ఆరుషిని హత్య చేశాడని పోలీసులకు చెప్పినందుకు రాజేశ్‌ను సెక్షన్ 203 కింద దోషిగా తేల్చినట్లు స్పష్టంచేసింది. సెక్షన్ 302 ప్రకారం దంపతులకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. అలాగే సెక్షన్ 201 ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగారం, రూ.5 వేల జరిమానా విధించింది. రాజేశ్ ఒక్కడికి సెక్షన్ 203 కింద ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ఖరారు చేసింది. వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసిన ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తన ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు.
 హైకోర్టులో సవాలు చేస్తాం..
 సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ‘‘ఇది సరైన తీర్పు కాదు. దీన్ని కచ్చితంగా పైకోర్టులో సవాలు చేస్తాం. రాజేశ్ దంపతులను కావాలని ఇందులో ఇరికించారు’’ అని వారి తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ తెలిపారు. ఈ కేసు విచారణలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కావాలనే తల్వార్ దంపతులను వేధించిందని ఆమె చెప్పారు. ఈ కేసులో సీబీఐ మీడియాకు ఒక వాదననే వినిపిస్తూ లీకులు ఇచ్చిందని తల్వార్ దంపతుల తరఫు మరో న్యాయవాది సత్యకేతు శర్మ ఆరోపించారు.


 మీడియా ముందు లాయర్ల తన్నులాట
 తీర్పు వెలువడ్డ వెంటనే కోర్టు ఆవరణలో మీడియాకు వివరాలు వెల్లడించేందుకు లాయర్లు పోటీపడ్డారు. టీవీ కెమెరాల ముందే తన్నులాటకు దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ దూషించుకున్నారు. ఇంతకూ వీరు అటు తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు కాదు.. ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులు కాదు! తీర్పు అనంతరం నరేష్ యాదవ్ అనే లాయర్ ముందుగా వచ్చి చానెళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన గతంలో సీబీఐకి సహాయ లాయర్‌గా పనిచేశారు. నరేష్ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనకాలే నిలబడ్డ సంజయ్ త్యాగి... మరో లాయర్ కూడా మాట్లాడేందుకు యత్నించారు. దీంతో నరేష్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు సంజయ్ నుదుటిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. మా లాయర్ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నావంటూ బూతు పురాణం ఎత్తుకున్నాడు. చివరికి ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాసేపటికి వేరేవారు వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement