సభలో అద్వానీ ఆగ్రహంతో మాట్లాడినా..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటులో తరచూ గందరగోళం చెలరేగి.. సమావేశాలు పూర్తిగా స్తంభించిపోతుండటంపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆగ్రహంగా కనిపించారు. సభలో ఒకవైపు ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళం కొనసాగుతుండగానే.. పార్టీ సహచరుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌తో అద్వానీ ఆగ్రహంతో మాట్లాడారు. 'ఎవరు సభను నడుపుతున్నారు? సమయమంతా వృథా అవుతోంది. ఇటు స్పీకర్ (సుమిత్రా మహాజన్) కానీ, అటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కానీ సభను నడిపించడం లేదు' అంటూ 89 ఏళ్ల ఆయన ఒకింత ఉద్వేగంతో, ఆగ్రహంతో అనంత్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు.
లోక్‌సభలో మధ్యాహ్న భోజన విరామానికి 15 నిమిషాల ముందు అద్వానీ స్వయంగా తనవద్దకు అనంత్‌కుమార్‌ను పిలిపించుకొని ఈ వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. లోక్‌సభలో గతకొన్ని రోజులుగా గందరగోళ దృశ్యాలు పునరావృతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సీనియర్ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులను సముదాయించేందుకు అనంత్‌కుమార్ ఎంత ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. స్పీకర్ కుర్చీకి సమీపంలో ఉన్న ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించి ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలను ఉద్దేశించి.. 'ప్రజలు చూస్తున్నారు. ఇలా చేయడం తగదు' అంటూ అనంత్‌కుమార్ పదేపదే పేర్కొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో సభ తీరుతో ఆందోళన చెందిన అద్వానీ.. "సమావేశాలు ఇలాగే కొనసాగితే ఇదే విషయాన్ని నేను బాహాటంగా ప్రజలకు చెప్తాను. స్పీకర్‌కు చెప్తాను' అని అసహనంగా పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయగా.. వాయిదా ఎందుకు సైన్‌డై చేయొచ్చుగా అంటూ లోక్‌సభ అధికారులతో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్‌లో ఎవరితో మాట్లాడకుండా అద్వానీ వెళ్లిపోయారు. దీంతో బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. సభను తరచూ ఆటంక పరుస్తుండటంతో ఒక సీనియర్ పార్లమెంటేరియన్ ఆందోళన, ఆక్రోషం ఇదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రతిపక్షాలే కారణమని నిందించారు.