ప్యూన్ ఆస్తులు రూ. 3 కోట్లు!
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ చిరుద్యోగి వద్ద ఊహకందని రీతిలో ఆదాయానికి మించి భారీ ఆస్తులు బయటపడ్డాయి. కోపరేటివ్ బ్యాంక్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న కుల్‌దీప్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన మూడిళ్లలో మంగళవారం లోకాయుక్త పోలీసులు దాడులు చేసి రూ. 3 కోట్లకు పైగా ఆస్తులు కనుగొన్నారు. వీటిలో ఒక డూప్లెక్ బంగ్లా సహా ఆరు పెద్ద ఇళ్లు, రెండు లగ్జరీ కార్లు, రూ. 3 లక్షల విలువైన నగలు, ఇళ్ల స్థలాలు, తదితరాలు ఉన్నాయి. యాదవ్‌కు బ్యాంక్ లాకర్, డిపాజిట్లు ఉన్నాయని మంగళవారం కూడా దాడులు జరుపుతామని పోలీసులు చెప్పారు. లెక్కింపు తర్వాత ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లకు చేరే అవకాశముందన్నారు.
సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందని యాదవ్ అవినీతికి పాల్పడకుంటే అసలు ఆదాయానికి 200 రెట్లు గడించడం సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం నెలకు రూ.20 వేల జీతం తీసుకుంటున్న యాదవ్ 30 ఏళ్ల సర్వీసు సంపాదన రూ. 16 లక్షలేనని, ఆయన వద్ద కోట్ల ఆస్తులు బయటపడ్డం విస్తుగొలుపుతోందని అన్నారు.