బంతి...చామంతి...ప్రేమించుకున్నాయ్ | Love stories of cricketers | Sakshi
Sakshi News home page

బంతి...చామంతి...ప్రేమించుకున్నాయ్

Published Sun, Nov 1 2015 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

బంతి...చామంతి...ప్రేమించుకున్నాయ్

బంతి...చామంతి...ప్రేమించుకున్నాయ్

కొన్ని ప్రేమలు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు ముగుస్తాయో తెలీదు. ఈ ప్రేమ పెళ్లి దాకా చేరుతుందని వారికే నమ్మకముండదు. అయినా సరే తాము కలసి తిరుగుతూ కనిపిస్తారు. ఎయిర్‌పోర్ట్‌లోనో, మరో పార్టీలోనో చిరునవ్వులు చిందిస్తూ,  కెమెరాల వైపు చేయి చూపుతూ అలా ఒక పోజిస్తారు. అంతే ఇదంతా వార్తల్లోకెక్కుతుంది. మీడియాలో మంచి పబ్లిసిటీ లభిస్తుంది. వారికి కావాల్సిందీ ఇదే. ఫామ్ కోల్పోయిన క్రికెటర్ అయినా, సినిమాలు లేని హీరోయిన్ అయినా అందరికీ ఇది మంచి బూస్ట్‌గా పని చేస్తుంది. భవిష్యత్తు సంగతి ఎవడు చూడబోయారు, ప్రస్తుతానికి మాత్రం మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఎంచక్కా గుడ్‌బై చెప్పేస్తారు.
 
ఆఫీసులో ఐదింటి వరకు సాగే ప్రేమలు కొన్నయితే... ఆ తర్వాత ఆరింటికి బస్టాపులో మొదలయ్యే ప్రేమలు మరికొన్ని... కాలేజీలో పుట్టే  ప్రేమలు కొన్నయితే... క్యాంటీన్‌లో పుట్టే ప్రేమలు మరికొన్ని... ఇదంతా మనం చూసే ప్రపంచం.

కానీ మరికొన్ని ప్రేమలు క్రికెట్ మైదానాల్లోనూ, సినిమా ప్రీమి యర్ షోలలోనూ పుడతాయి. ఒక మైలురాయి సాధించిన క్షణాన బ్యాట్ వెనకనుంచి ఓరకంట చూపులతో సఖికి సంకేతం పంపే ప్రేమ ఒకటైతే... నా రియల్ హీరో అంటూ ఒక్కసారిగా ప్రపంచం ముందు ప్రదర్శించే హీరోయిన్ ప్రేమ మరొకటి.

ఈ ప్రేమల్లో అన్నింటికీ శుభం కార్డు పడదు. అలా అని దుఃఖాంతాలూ కావు. నిజంగా గుండె లోతుల్లోంచి పుట్టే ప్రేమతో పెళ్లి దాకా చేరేవి కొన్నయితే... దానికి ముందే వీడ్కోలు తీసుకునే ప్రేమలు మరికొన్ని. అసలు ఇదంతా ట్రాష్ అన్నట్లుగా కొంత కాలం కలసి తిరగడం, వార్తల్లో నిలవడం కోసమే ప్రేమగా కనిపించే జంటలూ ఉంటాయి. అంతకు ముందు అతనికి పెళ్లయినా వెంటపడి తమ ప్రేమను గెలిపించుకున్నవారు కొందరు ఉంటే, మా దారి వేరయింది, అయినా స్నేహితులమే అంటూ చెప్పుకునేవారూ ఉన్నారు.
 
మన దేశంలో సినిమాలు, క్రికెట్‌లు రెండు కళ్లలాంటివి. ఆటగాళ్లకి, తారలకి ఉండే క్రేజ్ వేరు. ఈ రెండు రంగాలు కలసి అడుగు వేస్తే అభిమానులకు అంతకంటే కనువిందు ఏముంటుంది. అనుష్కశర్మకు తన సూపర్ హిట్ సినిమాలతో రాని గుర్తింపు విరాట్ కోహ్లి ఫ్లాప్ మ్యాచ్‌ల సమయంలో వచ్చిందనే వ్యాఖ్య ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హల్‌చల్ చేసింది.  క్రికెటర్లు, హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు ఎప్పుడైనా పాపులర్. 60వ దశకంనుంచి ఈతరం వరకు కూడా అలాంటి ఏ ఇద్దరు చేరినా అది వార్తగా మారింది. సంచలనంగా నిలిచింది. అలాంటి పెళ్లిళ్లు, పెటాకులు, ప్రేమలపై  ఫోకస్.
 - సాక్షి క్రీడావిభాగం
 
మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగోర్
భారత క్రికెట్, బాలీవుడ్ కలసి అడుగులో అడుగు వేసి విజయవంతంగా నిలిచిన తొలి జోడీ ఇది. భోపాల్ ముస్లిం నవాబుల వంశానికి చెందిన పటౌడీ అప్పటికే భారత స్టార్ క్రికెటర్. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బెంగాలీ కుటుంబానికి చెందిన షర్మిల కూడా ఆ సమయంలో బాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఒక సినిమాలో ఆమెను చూసిన పటౌడీ మనసు పారేసుకున్నాడు. మతాలు వేరు కావడంతో సహజంగానే పెద్దలనుంచి వ్యతిరేకత ఎదురైంది. కానీ వీరి పట్టుదల ముందు అది సరిపోలేదు. దాంతో 1969లో ఒక్కటైన పటౌడీ-షర్మిల తమ దాంపత్య జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా నిలిచారు. వీరి కుమారుడే ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్.
 
మొహసీన్ ఖాన్-రీనా రాయ్
దేశ సరిహద్దులు దాటిన ఈ ప్రేమ ఒక దశలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కనిపించినా...చివరకు బీటలు వారింది. పాకిస్తాన్ తరఫున 48 టెస్టులు ఆడిన క్రికెటర్ మొహసీన్ ఖాన్ భారత పర్యటనకు వచ్చి అప్పటి హీరోయిన్ రీనారాయ్‌ను ప్రేమించాడు. అందగాడైన మొహసీన్ పట్ల ఆకర్షితురాలైన రీనా దూసుకుపోతున్న తన కెరీర్‌కు ఒక్కసారిగా గుడ్‌బై చెప్పి పెళ్లికి సిద్ధమైంది. తన పరిచయాలతో అతడికి అవకాశాలు ఇప్పించి బాలీవుడ్ హీరోని కూడా చేసింది. అయితే తొమ్మిదేళ్ల తర్వాత ఈ బంధం ముగిసింది. భారత్‌కు తిరిగి వచ్చి రీనా మళ్లీ సినిమాల్లో సహాయక పాత్రలు వెతుక్కుంది.
 
హర్భజన్ సింగ్- గీతా బస్రా
వీరిద్దరి ప్రేమ వ్యవహారం కూడా సుదీర్ఘంగా దాదాపు ఐదేళ్లకు పైగా సాగింది. సైడ్ హీరోయిన్ పాత్రలకే ఎక్కువగా పరిమితమైన బస్రా, భజ్జీతో ప్రేమ వ్యవహారం వల్లే వార్తల్లో నిలిచింది. క్రికెట్ మ్యాచ్‌లకు రావడం, కలిసి ఎఫ్1 పోటీలు చూడటంతో ఒక దశలో ఇది కూడా సాధారణ ఫ్రెండ్‌షిప్ వ్యవహారంలాగే కనిపించింది. అయితే హర్భజన్ పట్టుదల ప్రదర్శించాడు. లండన్‌లో పుట్టినా... తమలాగే పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఈ భారత ఆఫ్‌స్పిన్నర్ తన తల్లిని ఒప్పించగలిగాడు. బల్లే బల్లే అంటూ వైభవంగా ఈ పెళ్లి జరిగింది.
 
అజహరుద్దీన్-సంగీతా బిజ్లాని
భారత క్రికెట్ జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న అజహర్‌కు పెళ్లయి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ సందర్భంగా సంగీతతో మొదలైన పరిచయం గాఢమైన ప్రేమగా మారింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సంగీత... హీరోయిన్‌గా మాత్రం పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. భారత జట్టులో రెగ్యులర్‌గా మారినా... సాధారణంగా ముభావంగా, కుటుంబ మనిషిగా కనిపించే అజహర్ కూడా ఈ  మాజీ మిస్ ఇండియా ముందు దాసోహం అన్నాడు. దాంతో మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ సంగీతను పెళ్లాడాడు. ముస్లింగా మారుతూ తన పేరును ఆయేషాగా మార్చుకున్నానని ఆమె చెప్పినా... అది ఎక్కడా పెద్దగా కనపడలేదు.
 
కంచికి చేరని పాపులర్ ప్రేమలు...
గ్యారీ సోబర్స్-అంజూ మహేంద్రు
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ 60వ దశకంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అంజూ మహేంద్రుతో ప్రేమలో పడ్డాడు. బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తం చేసి వీరిద్దరు పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే అంజూ తల్లిదండ్రులు విదేశీయుడితో వివాహానికి ససేమిరా అనడంతో దానికి అక్కడే బ్రేక్ పడింది.
 
రవిశాస్త్రి-అమృతా సింగ్
1985లో మినీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రవిశాస్త్రి ఒక్కసారిగా అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు. ఇదే క్రమంలో నటి అమృతా సింగ్‌తో అతను సుదీర్ఘ కాలం ప్రేమ వ్యవహారం నడిపాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు బాంబేలో పెద్ద పోస్టర్లుగా మారిపో యాయి. అయితే అనూహ్యంగా ఈ కథ ముగిసిపోయింది. తర్వాత అమృతాసింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇది కూడా పెటాకులై సైఫ్.. మరో హీరోయిన్ కరీనాకపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు.
 
ఇమ్రాన్ ఖాన్-జీనత్ అమన్
అతను ప్రపంచ క్రికెట్‌లో సెక్సీయెస్ట్ క్రికెటర్, ఆమె సెక్సీ హీరోయిన్...ఇద్దరి కెరీర్‌లు మంచి దశలో ఉన్న సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. పెళ్లి ఖాయం అనిపించిన దశలో ఇమ్రాన్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. తాను అప్పుడే పెళ్లి చేసుకోనని తేల్చేశాడు.
 
స్పెషల్ లవ్ స్టోరీ...
అయితే వీటన్నింటికీ భిన్నమైన, సంచలన ప్రేమ కథ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాలది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో కళాత్మక చిత్రాల నటి నీనాగుప్తా ముందు తన కళ ప్రదర్శించాడు. తమ వ్యవహారాన్ని నీనా ఏనాడూ దాచుకోలేదు. ఈనాటి సహజీవనాలతో పోలిస్తే 80లలో ఇదో పెద్ద సంచలనం. రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకపోయినా అతని ద్వారా పుట్టిన కూతురు మసాబాను పెంచి, పెద్ద చేసిన నీనా... ఆమెకు తండ్రి రిచర్డ్స్ అని బహిరంగంగానే ప్రకటించింది. ఆ తర్వాత వివ్ కూడా తమ బంధానికి అంగీకారం తెలిపాడు. అయినా రిచర్డ్స్ కూతురుగా పుట్టే అదృష్టం ఎంత మందికి దక్కుతుంది అంటూ తల్లిలాగే వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చిన మసాబా.... ఇటీవలే తెలుగువాడైన సినీ నిర్మాత మధు మంతెనను పెళ్లి చేసుకుంది.
 
విరాట్ కోహ్లి- అనుష్క శర్మ
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ లవ్ స్టోరీ ఇది. ఒక షాంపూ ప్రకటనలో కలి సి నటించిన స్నేహం ప్రేమగా మారింది. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్ వరకు, దక్షిణా ఫ్రికా నుంచి శ్రీలంక వరకు వీరి టూర్ కొనసాగుతోంది. అయితే 26 ఏళ్ల వయసులో కెరీర్‌లో మంచి దశలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అనేది సందేహమే.
 
జహీర్ ఖాన్- ఇషా శర్వాణి
కొన్నేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో జహీర్‌ఖాన్‌ను ఇషా రిసీవ్ చేసుకుంటూ అక్కడ చేసిన హడావుడి, అతనితో కలిసి ఇంటికి వెళ్లడం చూస్తే పెళ్లి గ్యారంటీ అనిపించింది. అయితే సుభాష్ ఘై కిస్నాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ క్లాసికల్ డ్యాన్సర్‌తో తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లకుండా జహీర్ మధ్యలోనే ముగించాడు.
 
యువరాజ్ సింగ్ -కిమ్ శర్మ
యువరాజ్‌కు అమ్మాయిలతో జత కట్టి వార్తలు రాయడం కొత్త కాదు కానీ వీరిద్దరి స్నేహం మాత్రం నాలుగేళ్లకు పైగానే సాగింది. సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోలేని కిమ్, యువీ కారణంగా హైలైట్ అయింది. చివరకు యువీ తల్లి చొరవతో ఈ వ్యవహారం ముగిసిపోయింది.
 
సౌరవ్ గంగూలీ-నగ్మా
పెద్దలను ఎదిరించి తన చిన్న నాటి స్నేహితురాలు డోనాను పెళ్లి చే సుకున్న సౌరవ్ కూడా ఒక దశలో దారి తప్పాడు. నాటి టాప్ హీ రోయిన్ నగ్మాతో చిన్నపాటి ప్రే మ వ్యవహారం నడిపాడు. వీరి ద్దరు బహిరంగంగా ఎప్పుడూ దీని గురించి మాట్లాడకపో వడంతో పాటు ఎక్కువ కాలం వార్తల్లో నిలవకపోవడం వల్ల కూ డా సమస్య రాలేదు. అయితే సౌరవ్, నగ్మా కలిసి ఒక సారి శ్రీకాళహస్తిలో సర్ప దోష నివారణ పూజ చేయించడం అనుమానాలను పెంచింది. ఇక ధోని, శ్రీశాంత్‌లాంటి క్రికెటర్లతో హీరోయిన్ల పేరు చేరుస్తూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చినా అవన్నీ దమ్ము లేనివే.
 
క్రికెటేతర ప్రేమలు...
భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, సినీ హీరోయిన్ లారా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. 12 గ్రాండ్‌స్లామ్‌ల విజేత అయిన భూపతి ఈ పెళ్లి కోసం తన మొదటి భార్య శ్వేతా జైశంకర్‌కు విడాకులివ్వగా... 2000 మిస్ యూనివర్స్ లారా దత్తా పెళ్లికి ముందు మోడల్ కెల్లీ దోర్జ్ (డాన్ విలన్)తో సుదీర్ఘ కాలం ప్రేమ వ్యవహారం నడిపింది. ప్రముఖ గోల్ఫర్ జ్యోతి రణ్‌ధావా... మోడల్, నటి చిత్రాంగదా సింగ్‌ను వివాహమాడాడు. అయితే పుష్కర కాలం తర్వాత ఈ వివాహ బంధం ముగిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement