యువతలో ఖర్చు ఎక్కువ-పొదుపు తక్కువ
నెల సంపాదనలో 69 శాతం కరిగిపోతోంది...
ఐసీఐసీఐ లాంబార్డ్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలం మారింది. గతంలో సంపాదించిన దాంట్లో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే ఈ తరం యువత జల్సాలకే తమ ఓటు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో నివసిస్తున్న యువత విందులు, విలాసాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తోందంట. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు మధ్యనున్న వారు నెలవారీ సంపాదనలో 69 శాతం ఖర్చు చేస్తున్నట్లు ప్రైవేటు సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ సర్వేలో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా ఎనిమిది నగరాల్లో నివసిస్తున్న 25 నుంచి 35 ఏళ్ల వారిపై నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇలా ఖర్చు చేస్తున్నదాంట్లో 50 శాతం కుటుంబం, ఇంటి అవసరాలకు కోసం కేటాయిస్తుంటే, ఆ తర్వాతి స్థానాల్లో ఈఎంలు, బీమా ప్రీమియంలున్నాయి.
ఇంటికి ఖర్చు చేస్తున్న దాంట్లో వారాంతాల్లో రెస్టారెంట్లు, విహార యాత్రలదే అగ్రస్థానం. సంపాదనలో ఆరోగ్య సంరక్షణకు 5 శాతం కూడా కేటాయించడం లేదు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు క్లెయిమ్ గణాంకాలను విశ్లేషిస్తే తెలుస్తోందని ఐసీఐసీఐ లాంబార్డ్ పేర్కొంది. ఆరోగ్య బీమా తీసుకోనివారు పొదుపు తక్కువగాను, వైద్య అవసరాలకు ఎక్కువగాను ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో తేలినట్లు పేర్కొంది. కానీ సర్వేలో పాల్గొన్నవారిలో 68 శాతం మంది కాలంతో పరుగులు పెట్టే జీవన విధానం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ చీఫ్ సంజయ్ దత్తా వివరించారు. 43 శాతం మంది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే ఆరోగ్య బీమా తీసుకుంటున్నట్లు వెల్లడించడం విశేషం.