గ్యాస్ ధర పెంపు.. నాన్ సబ్సిడీ సిలిండర్ 1327!!
సామాన్యుడిపై మరోసారి 'బండ' పడింది. గ్యాస్ ధర మరింత పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచేసింది. అంటే, ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమన్న మాట. పదో సిలిండర్ నుంచి ఒక్కోటీ రూ. 1327.50 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర కేవలం 1112.50 రూపాయలు మాత్రమే ఉండేది. ఒక్కసారిగా నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలను 215 రూపాయలు పెంచేశారు.
దీంతోపాటు సబ్సిడీ సిలెండర్ ధరను కూడా స్వల్పంగా పెంచారు. రాయితీ పోను హైదరాబాద్‌లో రూ.441కు సిలెండర్ ధర చేరుకుంది. ఇది ఇప్పటివరకు రూ. 411.50 గా ఉండేది. అంటే, సబ్సిడీ సిలిండర్ల ధర ఒక్కోటీ రూ. 30 వంతున పెరిగిందన్నమాట. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం రూ. 843 వరకు సబ్సిడీ ఇస్తుండగా, ఆ సబ్సిడీ ప్రభుత్వం నుంచి కంపెనీలకు చేరట్లేదని, అందుకే సబ్సిడీ సిలిండర్ ధర కూడా పెరిగిందని అంటున్నారు.