'అందుకే కేసీఆర్.. బాబును అన్న అంటున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులను పరస్పరం నీరుగార్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులు ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. కేసీఆర్ అందుకే చంద్రబాబును అన్న అని పిలుస్తున్నారని చెప్పారు. ఇద్దరు చంద్రులు వెన్నెల పొందుతూ, ప్రజలకు చీకటి పంచుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు వెన్నుపొటు పొడిచి రాజకీయంగా ఎదిగిన ఇద్దరు చంద్రులు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లో నటిస్తున్నారని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్దిపొందడం కోసమే కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. వాటర్గ్రిడ్ పథకానికి 4 వేల కోట్లు రూపాయలు చాలని, 40 వేల కోట్లు అవసరం లేదని అన్నారు. ఎర్రవెల్లి గ్రామానికి ఉత్తమ సర్పంచ్.. తెలంగాణకు దరిద్రపు సీఎం కేసీఆర్ అని మధు యాష్కీ విమర్శించారు. కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్కు అక్రమ విల్లాలు ఉన్నాయని, ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలు చేస్తున్నారని, ఆయన అవినీతికి ఇవే నిదర్శనమని ఆరోపించారు.