
పి.మధుసూదన్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: నవరత్న క్యాటగరీలో ఉన్న ప్రభుత్వరంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(విశాఖ ఉక్కు) తొమ్మిదో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా పి.మధుసూదన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్లాంట్ ప్రారంభం తరువాత మొదటి తెలుగు సీఎండీగావై.శివసాగరరావు బాధ్యతలు నిర్వహించగా ఈ నియామకంతో రెండో తెలుగు వ్యక్తిగా మధుసూదన్‌కు ఖ్యాతి దక్కింది. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన ఏపీ చౌదరి డిసెంబర్ 31న పదవీవిరమణ చేయడంతో ఆ పోస్టుకు డెరైక్టర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌ను కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మధుసూదన్, ఉన్నతాధికారులనుద్దేశించి మాట్లాడుతూ వారికి ప్లాంట్ భవిష్యత్‌పై దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది విస్తరణ యూనిట్లయిన బ్లాస్ట్‌ఫర్నేస్, స్టీల్ మెల్ట్‌షాప్ రోలింగ్‌మిల్స్‌ను ఉత్పత్తి ప్రక్రియలో తేవడం వంటి కీలక బాధ్యతలు ఉద్యోగులపై ఉందన్నారు. గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్, కృష్ణా బ్లాస్ట్‌ఫర్నేస్, మొదటి స్టీల్ మెల్ట్‌షాప్ ఆధునీకరణ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మొదటి సింటర్‌ప్లాంట్, ఐదో కోక్‌ఓవెన్ బ్యాటరీ పనులకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చామన్నారు.
విస్తృత అనుభవం
గుంటూరు జిల్లా ఆరేపల్లిలో 1958, మే 9న జన్మించిన మధుసూదన్ జన్మించారు. 1975-78లో ఆయన ఆంధ్రాయూనివర్సిటీ నుంచి బీకామ్ పట్టా పొందారు. 1982లో సీఏ, 1984లో ఐసీడబ్ల్యూఏఐ, 1986లో కంపెనీ సెక్రటరీ కోర్సులు పూర్తి చేసి బిలాయ్ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా చేరారు. అక్కడ 24ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేశారు. బర్క్‌ఫూర్ ఇస్కో స్టీల్‌ప్లాంట్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం ఆయన 2009 నవంబర్ 2న ఉక్కు ఫైనాన్స్ డెరైక్టర్‌గా విశాఖ ఉక్కులో చేరారు. బిలాయ్ స్టీల్‌ప్లాంట్‌లో అతి ముఖ్యమైన ప్రూడెంట్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, వ్యయ నియంత్రణ, ఈఆర్‌పీ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, ట్యాక్స్ ప్లానింగ్ తదితర అంశాల్లో కీలకపాత్ర వహించారు. ఉక్కు డెరైక్టర్ (ఫైనాన్స్)గా మధుసూదన్ సుమారు రూ.12వేల కోట్ల వ్యయంతో 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
అనేక సవాళ్ళు
సీఎండీగా మధుసూదన్ 2018 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఎం వోయూ లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. అరకొరగా ప్రారంభమైన 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రక్రియలోకి తేవాల్సి ఉంటుంది. 7.3 మిలియన్ టన్నుల విస్తరణ పనులు పూర్తి చేయాలి. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో లాభాలు తగ్గుతున్నాయి. తద్వారా విస్తరణ పనులకు నిధులు సమీకరించాల్సి వస్తోంది.