భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోవరద నీటిలో చిక్కుకున్న 20 మందిని రక్షించిన ఓ యువకుడు అదుపుతప్పి వరదనీటిలో పడి కొట్టుకుపోయిన హృదయ విదారక సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ మురికివాడ నల్లాలో నుంచి ఉప్పొంగిన వరదనీటి నుంచి 20 మందిని రక్షించేందుకు దీపక్ సాహూ(20) అనే యువకుడు నీటిలోకి దిగాడు.
19 మందిని వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతానికి చేర్చిన సాహూ చివరగా కమలాబాయి(55) ఏళ్ల వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చే క్రమంలో ఆమె చేయి పట్టుకుని లాగాడు. అయితే వృద్ధురాలు క్షేమంగా ఒడ్డుకు చేరాక నీటి ఒరవడికి అదుపుతప్పి అతడు వరదనీటిలో పడి కొట్టుకుపోయాడు. దీపక్ కాపాడిన వాళ్లందరూ అతను కొట్టుకునిపోతుంటే చూస్తూ నిలబడి పోయారని అతని సోదరుడు ప్రదీప్ చెప్పారు. మధ్యప్రదేశ్ లో వరదల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడ్డారు.