Rajiv Nagar
-
కరగని ‘గుండె’
సిరిసిల్ల: కొందరి కష్టాలు చూస్తే పగవారికైనా రావద్దనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు.. భార్య ఏనాడో కన్నుమూసింది. కొడుకుతో కలసి సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ నేత కార్మికుడి గుండె ఆగిపోయింది. అయితే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట టెంట్ వేసుకుని శవాన్ని ఉంచాల్సి వచ్చింది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లో నివసించే దీకొండ దేవదాస్ (66) నేతకార్మికుడు. దేవదాస్ భార్య కళావతి చాలా రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అరుణ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, దేవదాస్ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో శవాన్ని ఇంటికి తేవద్దని యజమాని చెప్పాడు. దీంతో కొడుకు అరుణ్‌కు ఎటు పోవాలో తెలియక శుక్రవారం రాజీవ్‌నగర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో టెంట్ వేసి తండ్రి శవాన్ని ఉంచాడు. ఓ కూతురు భివండిలో ఉండడంతో ఆమె వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు అక్కడే నిరీక్షించారు. అరుణ్ చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. పేదవాడైన అరుణ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా! ముఖంపై గాయాలు.. పరారీలో భర్త
సాక్షి, కుషాయిగూడ: హెచ్‌బీకాలనీ, రాజీవ్‌నగర్‌లో మహిళ మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి ముఖంపై గాయాలు, మెడకు తాడు బిగించినట్లు కనిపిస్తున్న గుర్తులు చూస్తుంటే ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే సందేహం వస్తోంది. సోమవారం రాత్రి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో లక్ష్మీ అనే గృహిణి అనుమానాస్పదంగ మృతిచెందిన విషయం తెలిసిందే. భర్త పరుశరాం పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చదవండి: మణికొండ: యువతితో క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన పరుశరాం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి కంటే వయసులో పెద్దదైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మితో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకు దారితీసింది. మృతురాలు లక్ష్మీది రెండో వివాహం అని తెలుస్తోంది. గత ఐదు నెలల క్రితమే హెచ్‌బీ కాలనీ, రాజీవ్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని కొత్తగా సంసారం పెట్టారు. ఇద్దరూ కూలి పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. నిత్యం మద్యం తాగే అలవాటున్న వీరు రోజూ తాగి ఇంటికి వచ్చి గొడవ పడటం తరచుగా జరిగేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం, ప్రాణం తీసింది ఈ క్రమంలోనే పరుశరాం భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతురాలి ముఖంపై గాయాలు, చెవి, ముక్కు, నోరు, కళ్లలోంచి కారుతున్న రక్తం మరకలు, గొంతుపై కనిపిస్తున్న చారలను బట్టి ఆమెది హత్యేనన్న అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త పరుశరాంను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. -
వరదల్లో 20 మందిని కాపాడి..
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోవరద నీటిలో చిక్కుకున్న 20 మందిని రక్షించిన ఓ యువకుడు అదుపుతప్పి వరదనీటిలో పడి కొట్టుకుపోయిన హృదయ విదారక సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాజీవ్ నగర్ మురికివాడ నల్లాలో నుంచి ఉప్పొంగిన వరదనీటి నుంచి 20 మందిని రక్షించేందుకు దీపక్ సాహూ(20) అనే యువకుడు నీటిలోకి దిగాడు. 19 మందిని వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతానికి చేర్చిన సాహూ చివరగా కమలాబాయి(55) ఏళ్ల వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చే క్రమంలో ఆమె చేయి పట్టుకుని లాగాడు. అయితే వృద్ధురాలు క్షేమంగా ఒడ్డుకు చేరాక నీటి ఒరవడికి అదుపుతప్పి అతడు వరదనీటిలో పడి కొట్టుకుపోయాడు. దీపక్ కాపాడిన వాళ్లందరూ అతను కొట్టుకునిపోతుంటే చూస్తూ నిలబడి పోయారని అతని సోదరుడు ప్రదీప్ చెప్పారు. మధ్యప్రదేశ్ లో వరదల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడ్డారు. -
భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. భర్త లేకుండా తాము జీవించలేమంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం లక్ష్మి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కాగా ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి
-
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐదుగురి మృతి
కర్నూలు : కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ సమీపంలో ఉదయం ఆరు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి గుత్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కాశీరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా చిరువ్యాపారులు. వివిధ గ్రామాల్లో బట్టలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. పెద్దహుల్తి గ్రామంలో జరుగుతున్న దీపావళి తిరునాళ్లలో వ్యాపారం చేసుకునేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జమ్మక్క అనే గర్భవతికి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు పెద్దయ్య, లక్ష్మన్నలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. బాధితులంతా పత్తికొండ రాజీవ్ నగర్ వాసులు. క్షతగాత్రులు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
ఈగల మోత.. పందుల రోత
ఈగల మోత.. పందుల రోత గనంపూడి, : సాధారణంగా ఈగలు ఆషాడ మాసంలో విజృంభిస్తుంటాయి. కానీ ఇక్కడ ఏడాది పొడువునా 50 కుటుంబాలను నిద్రకు దూరం చేస్తున్నాయి. కోళ్లఫారం వల్ల పెరిగిన ఈగలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి, చర్యలు తీసుకోండి మహాప్రభో అంటున్నా జీవీఎంసీ అధికారుల్లో చలనం లేదంటూ వాపోతున్నారు. దువ్వాడ స్టేషన్ రోడ్డు నుంచి రాజీవ్‌నగర్‌కు వెళ్లే సాయిరామ్‌నగర్‌లో 50 కుటుంబాల వారుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ఇళ్లు కట్టుకుంటున్నామని సంబరపడిన వీరు ఇళ్లు ఎందుకు కట్టుకున్నామంటూ మదనపడుతున్నారు. కాలనీకి అరకిలోమీటరు దూరంలో ఉన్న కోళ్ల ఫారం నుంచి దుర్గంధం వెలువడుతోంది. ఐదు నిమిషాలు రోడ్డుమీద నిలబడితే చాలు కందిరీగల్లా ఈగలు పరుగులెత్తిస్తున్నాయి. ఇక్కడ శుభ కార్యాలంటేనే బెంబేలెత్తుతున్నారు. తినుబండారాలు, గ్లాసుల మీద మూగిన ఈగలతో భోజనాలు చేయలేకపోతున్నారు. ఇటీవల ఒక ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఈగల మోతకు బంధువులు భోజనాలు చేయకుండానే చేతులు కడుక్కొని వెళ్లిపోయారని ఉదహరిస్తున్నారు. దీంతో సాయిరామ్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్అసోసియేషన్ కలెక్టర్‌కు, జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మరోవైపు వీరిని దోమలు, పందులు కూడా వెంటాడుతున్నాయి. వాడకం నీటిలో పందుల గుంపులు తిష్ట వేస్తున్నాయి. దీంతో అద్దెకు దిగినా కొన్నాళ్లకే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా బహుళ అంతస్తులూ ఖాళీగా ఉండిపోతున్నాయి. -
అత్తారింట్లో అల్లుడి వీరంగం బాలుడి హత్య
మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్ : అత్తారింటికి వచ్చిన అల్లుడు ఉన్మాదిగా మారి అర్ధరాత్రి బీభత్సం సృష్టించి ఒక బాలుడిని హతమార్చడమేకాక, భార్య, అత్త, మామపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శనివారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు... పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల కుమార్తె మంజులను కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కోనప్పనహళ్లి అగ్రహారానికి చెందిన జయశీలన్ బెంజిమన్ అలియాస్ ప్రభుదాస్‌కు ఇచ్చి 2012 మే 25న వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.2 లక్షలు నగదు, వంద గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని ఇచ్చారు. బెంజిమన్ జల్సాలకు అలవాటుపడి సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు అదనపు కట్నం తేవాలని పెళ్లి అయిన మూడు నెలల నుంచే భార్యను వేధించేవాడు. దీంతో మంజుల పెళ్లి జరిగిన ఆర్నెల్లకే పుట్టింటికి చేరుకుంది. భార్య కాపురానికి రావాలంటూ భర్త పెద్దమనుషులను తీసుకొచ్చి 15 రోజుల క్రితం పంచాయితీ పెట్టించాడు. రూ.4లక్షలు ఇస్తే అప్పులు తీరిపోతాయని అత్తమామలను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. శనివారం రాత్రి మరోసారి అత్తగారింటికి వచ్చాడు. పెళ్లి సమయంలో పెద్దమనిషిగా వ్యవహరించిన వారిని వెంట తీసుకొచ్చి మళ్లీ పంచాయితీ పెట్టించాడు. కుమార్తెను కాపురానికి పంపాలంటే బెంజిమన్ తల్లిని, బంధువులను తీసుకురావాలని చెప్పారు మంజుల తల్లి దండ్రులు చెప్పారు. అప్పటికే పొద్దుపోవడంతో బెంజిమన్‌ను అక్కడే పడుకోనిచ్చారు. అతని పక్కనే తన భార్య అక్క కుమారుడు శశికుమార్(15) పడుకున్నాడు. అర్ధరాత్రి 1.30గంటల ప్రాంతంలో బెంజిమన్ తన వెంటతెచ్చుకున్న కత్తితో నిద్రపోతున్న శశికుమార్ ఛాతీ, మెడ, చేతులపై దారుణంగా పొడిచాడు. అరుపులకు పక్క గదిలో అత్త, మామ, భార్య బయటకు వచ్చారు. వారిపై కూడా దాడిచేసి కత్తితో పలుచోట్ల పొడిచాడు. వారి అరుపులకు ఇరుగుపొరుగువారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బెంజిమన్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నలుగురిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శశికుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పరీక్షించేలోపే మృతిచెందాడు. మంజుల, నరసింహులు(65), ఉత్తమ్మ(55) పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. డీఎస్పీ రాఘవరెడ్డి, వన్ టౌన్ సీఐ నారాయణస్వామిరెడ్డి, ఎస్ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. మంజుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాన్నా.. ఒక్కసారి మాట్లాడరా.. మంజుల అక్క ఉమకు శశికుమార్ ఒక్కడే కుమారుడు. తన పిన్నమ్మ పరిస్థితి బాధాకరంగా ఉండడంతో ఆమె కు తోడుగా ఉండేందుకు వచ్చి శశికుమార్ అక్కడే పడుకోవడంతో మృత్యువాత పడ్డాడు. కొడుకు మృతితో కన్నీరుమున్నీరవుతున్న ఉమను ఓదార్చడానికి ఎవరివల్లా కాలేదు. ‘నాన్నా ఒక్కసారి మాట్లాడరా’ అంటూ కుమారుడి మృత దేహంపై పడి ఆ తల్లి రోదించడం పలువురిని కంటతడిపెట్టించింది.