
ఈగల మోత.. పందుల రోత
ఈగల మోత.. పందుల రోత
గనంపూడి, :
సాధారణంగా ఈగలు ఆషాడ మాసంలో విజృంభిస్తుంటాయి. కానీ ఇక్కడ ఏడాది పొడువునా 50 కుటుంబాలను నిద్రకు దూరం చేస్తున్నాయి. కోళ్లఫారం వల్ల పెరిగిన ఈగలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి, చర్యలు తీసుకోండి మహాప్రభో అంటున్నా జీవీఎంసీ అధికారుల్లో చలనం లేదంటూ వాపోతున్నారు. దువ్వాడ స్టేషన్ రోడ్డు నుంచి రాజీవ్‌నగర్‌కు వెళ్లే సాయిరామ్‌నగర్‌లో 50 కుటుంబాల వారుంటున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఇళ్లు కట్టుకుంటున్నామని సంబరపడిన వీరు ఇళ్లు ఎందుకు కట్టుకున్నామంటూ మదనపడుతున్నారు. కాలనీకి అరకిలోమీటరు దూరంలో ఉన్న కోళ్ల ఫారం నుంచి దుర్గంధం వెలువడుతోంది. ఐదు నిమిషాలు రోడ్డుమీద నిలబడితే చాలు కందిరీగల్లా ఈగలు పరుగులెత్తిస్తున్నాయి. ఇక్కడ శుభ కార్యాలంటేనే బెంబేలెత్తుతున్నారు. తినుబండారాలు, గ్లాసుల మీద మూగిన ఈగలతో భోజనాలు చేయలేకపోతున్నారు. ఇటీవల ఒక ఇంట్లో జరిగిన శుభకార్యంలో ఈగల మోతకు బంధువులు భోజనాలు చేయకుండానే చేతులు కడుక్కొని వెళ్లిపోయారని ఉదహరిస్తున్నారు. దీంతో సాయిరామ్‌నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్‌అసోసియేషన్ కలెక్టర్‌కు, జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మరోవైపు వీరిని దోమలు, పందులు కూడా వెంటాడుతున్నాయి. వాడకం నీటిలో పందుల గుంపులు తిష్ట వేస్తున్నాయి. దీంతో అద్దెకు దిగినా కొన్నాళ్లకే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా బహుళ అంతస్తులూ ఖాళీగా ఉండిపోతున్నాయి.