కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ! | maharashtra call centre robs us citizens for nearly rs 500 crores | Sakshi
Sakshi News home page

కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!

Published Thu, Oct 6 2016 9:07 AM | Last Updated on Fri, Aug 24 2018 4:46 PM

కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ! - Sakshi

కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!

గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. మన దేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి!! అవును.. థానెలోని మీరారోడ్డు కాల్‌సెంటర్ స్కాం వెల్లడిస్తున్న భయంకర వాస్తవమిది. ఇప్పటివరకు బయటపడింది కూడా చాలా చిన్నదే కావచ్చని, ఇందులో మరింత పెద్ద మొత్తం ఉండి ఉండొచ్చని పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. అక్రమ కాల్‌సెంటర్లకు చెందిన మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.

స్కాం ఎలా జరిగిందంటే...
కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు ఇచ్చి వీళ్లకు సాయం చేసేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి.. చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో అంతకు సెటిల్ చేసేవారు.

ఎలా పట్టుబడ్డారు..
మూడు అక్రమ కాల్‌సెంటర్లపై థానె పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. మీరా రోడ్డులోని ఏడు అంతస్తుల డెల్టా బిల్డింగులో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున 24 గంటలూ నడిచే ఈ కాల్‌సెంటర్ల గుట్టు అప్పుడే బయటపడింది. కాల్ సెంటర్ల యజమానులు ఎలాగోలా తప్పుకొన్నారు. అయితే హైదర్ అలీ అయూబ్ మన్సూరీ అనే ఒక డైరెక్టర్‌ను మాత్రం పోలీసులు అరెస్టుచేశారు. అసలైన యజమానుల కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. హరిఓం ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్‌సోర్సింగ్ సర్వీస్, ఆస్వాల్ హౌస్ అనే ఈ మూడు కాల్ సెంటర్లలో ఒక్కోదాంట్లో రోజుకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు సంపాదిస్తున్నారు. ప్రాక్సీ సెర్వర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కాల్ చేయడంతో ఎక్కడినుంచి చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. తన ఇంటిమీద దాడి జరగకుండా ఉండేందుకు ఒక వ్యక్తి ఏకంగా 60వేల డాలర్లు సమర్పించుకున్నాడు. వీళ్ల దగ్గర నుంచి 852 హార్డ్ డిస్కులు, హై ఎండ్ సెర్వర్లు, డీవీఆర్లు, ల్యాప్‌టాప్‌లు, కోటి రూపాయల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు అంతస్తులలో పైదాంట్లో శిక్షణ ఇచ్చేవారు. మిగిలిన ఒక్కో ఫ్లోర్‌లో దాదాపు వంద వరకు ఇంటర్‌నెట్ కనెక్షన్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement