బీజేపీలోకి మరో కీలక నేత!
మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ రాణే ఇంటిని సందర్శించడం.. ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెరలేపింది. వినాయక చవితి సందర్భంగా రాణే ఇంటిలో పూజకు మర్యాదపూర్వకంగా హాజరైనట్టు సీఎం ఫడ్నవిస్ మీడియాకు చెప్తున్నా.. రాణే బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైందన్న సంకేతాలు ఇది ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సీఎం ఫడ్నవిస్ రాణే ఇంటిని సందర్శించిన ఫొటోను రాణే తనయుడు, ఎమ్మెల్యే నితేష్ ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అంతకుముందు ఆయన ట్విట్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక చవితి శుభాకాంక్షలను కూడా రీట్వీట్ చేసుకోవడం గమనార్హం.
రాణే ఇంటికి తాను వెళ్లడం రాజకీయ పర్యటన కాదని, తాము రాజకీయాల గురించి చర్చించలేదని ఫడ్నవిస్ మీడియాకు చెప్పారు. రాణే బీజేపీలో చేరుతున్న సంగతి కూడా తనకు తెలియదన్నారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఆదివారం నారాయణ్ రాణే కలువబోతున్నట్టు వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీలో చేరేందుకు రాణే ప్రయత్నిస్తున్నారని, కానీ, ఇందుకు బీజేపీ షరతులు పెడుతోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.