బదౌన్ గ్యాంగ్రేప్ కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ గ్యాంగ్రేప్, హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈకేసులో ప్రధాన ప్రత్యక్షసాక్షి సత్యశోధన పరీక్షలో విఫలమైయ్యాడు. దీంతో అతడు చెప్పిన సాక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రధానసాక్షి అయిన నజ్రూకు ఇటీవల పాలీగ్రాఫిక్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నివేదిక ఈరోజు తమకు అందిందని సీబీఐ తెలిపింది.
అయితే నజ్రూ చెప్పిన సాక్ష్యానికి, పరీక్షలో వచ్చిన ఫలితానికి పొంతన లేదని వెల్లడించింది. నజ్రూ చెప్పిన సాక్ష్యం ఆధారంగానే యూపీ పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. యూపీలోని బదౌన్ లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం వారిని చెట్టుకు ఉరేసి హత్య చేసినట్టు ఆరోపణలు రావడంతో సంచలనం రేగింది. అయితే బాలికలపై అత్యాచారం జరగలేదని డీఎన్ఏ పరీక్షలో తేలింది.