మోదీ షాక్: ఆ బ్యాంకుకు భారీగా పాత నోట్లు
మల్లాపురం : మలబార్ జిల్లా సహకార బ్యాంకులో సీబీఐ అధికారులు జరిపిన అకస్మాత్తు తనిఖీల్లో భారీగా పాత నోట్లు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 8న పెద్ద రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం మొదటి ఐదు రోజుల్లోనే రూ.169 కోట్ల రద్దయిన నోట్లు ఆ బ్యాంకుల్లో జమ అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన డిపాజిట్దారుల డాక్యుమెంట్లు సమర్పించాలని సీబీఐ బ్యాంకును ఆదేశించింది. అయితే బ్యాంకు అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఈ డిపాజిట్లు చేసుకున్నట్టు తెలిసింది.
బ్యాంకుకు సంబంధించిన 54 శాఖల్లో, 296 కోపరేటివ్ సొసైటీల్లో నవంబర్ 10 నుంచి 14 వరకు మొత్తం రూ.169 కోట్ల రద్దయిన నోట్లు జమ అయినట్టు ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. వీటిని శాఖల వారు రూ.84 కోట్లను, సొసైటీలు రూ.85 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. కానీ నవంబర్ 10న బ్యాంకుల్లో జమైన మిగతా రూ.97 కోట్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఈ నగదుపై క్లారిటీ ఇవ్వాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. పెద్ద నోట్లు రద్దుచేసినప్పటి నుంచి జిల్లా సహకార బ్యాంకులు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో సీబీఐ ఈ రైడ్స్ నిర్వహించింది.
అయితే బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేసే ప్రతి వ్యక్తికి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం తమ బాధ్యత కాదని, కానీ తాము కేవైసీ నిబంధనలను పాటిస్తున్నామని మలబార్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ మీనన్ చెప్పారు. కస్టమర్ల వివరాలను ఇన్వెస్టిగేషన్ టీమ్తో పంచుకుంటామన్నారు. అయితే కేవైసీ నిబంధనలు పాటించాలని తమకు ఆర్బీఐ దగ్గర్నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేన్నారు.