నటి కేసు: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
కొచ్చి: ప్రముఖ మలయాళ నటి అపహరణ, దాడి కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సుని గురువారం కోర్టులో లొంగిపోయాడు. తన అనుచరుడు విజేశ్ తో కొచ్చి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సరెండర్ అయ్యాడు. కోర్టు వెలుపల భారీగా సంఖ్యలో ఉన్న పోలీసులు న్యాయమూర్తి చాంబర్ లోకి వచ్చి నిందితులను తమ అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. నిందితుల తరపు న్యాయవాదులను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు లాగిపడేశారు. తర్వాత నిందితులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. లొంగిపోవడానికి వచ్చిన నిందితులను బయటకు లాక్కెళ్లి, అరెస్ట్ చేయడంపై డ్యూటీ మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేస్తామని సునీల్ తరపు న్యాయవాది తెలిపారు.
కాగా, ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణను కేరళ హైకోర్టు మార్చి 3కు వాయిదా వేసింది. నటిపై దాడి వెనుక సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే సునీల్ ముఠాతో ఈ దారుణం చేయించినట్టు తెలుస్తోంది. దాడి వెనుకున్న వారిని కూడా వదిలిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.