Pulsar Suni
-
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు. నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య అయిన కావ్యా మాధవన్‌కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరో నటి కావ్యా మాధవన్ మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో లైంగికంగా వేధించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలిపాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 'మేడం' ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 'మేడం' అని మాత్రమే చెప్పిన పల్సర్ సునీ.. ఆమె పేరు, వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదని తెలుస్తోంది. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధవనే ఈ 'మేడం' అయి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పల్సర్ సునీ ఎవడో తనకు తెలియదని కావ్యా మాధవన్ అంటుండగా.. ఆమె వ్యాఖ్యలను పల్సన్ సునీ తోసిపుచ్చాడు. 'కావ్యా నేనెవరో తెలియదనడం మూర్ఖత్వం. ఆమెకు నేను బాగా తెలుసు' అని పల్సర్ సునీ మీడియాతో తెలిపాడు. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్య కూడా పాత్రధారిగా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్టార్ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!
తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మొదటినుంచీ ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దొరికిన ఓ కీలకసాక్ష్యం ఆధారంగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో దిలీప్ వాడిన ఓ సీక్రెట్ మొబైల్ నంబర్ ఆధారంగానే ఆయన అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఆ నంబరే లభించడమే ఆయన అరెస్ట్‌లో కీలకపాత్ర పోషించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ కీలక సమాచారాన్ని తన ఫోన్ నుంచి ఇండస్ట్రీకి చెందిన కొందరికి పంపించాడు. ఎవరికి సమాచారం అందించాడో మాత్రం పల్సర్ సునీ వెల్లడించలేదు. కొందరికి విషయం చెప్పేశాను, నాకు డబ్బు ఇవ్వాలంటూ దిలీప్‌ను నిందితుడు సునీ డిమాండ్ చేయగా అందుకు ఆయన నిరాకరించాడు. సునీ తనను వేధిస్తున్నాడని, రూ.1.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కొన్ని రోజుల కిందట ఆయన పోలీసులను ఆశ్రయించారు. గత వారం దిలీప్‌ను పిలిపించిన పోలీసులు దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించి విచారించారు. దిలీప్ భార్య కావ్య మాధవన్, మేనేజర్ అప్పుణ్ని, అనూప్ అనే మరోవ్యక్తికి ఈ నటుడు చేసిన కాల్స్ లిస్ట్ పరిశీలించగా ఓ కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవట్ నంబర్‌ను వాడి తన సన్నిహితులకు కాల్స్ చేసేవారని, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు అదే నంబర్‌తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దిలీప్‌ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు. -
హీరోయిన్ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం
కోచి : మలయాళ హీరోయిన్ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న హీరోయిన్ను కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు వేధించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పల్సర్ సుని అనే వ్యక్తిని, హీరోయిన్ వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి తమకు లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు. కారులో ఆమెను వేధిస్తుండగా మొబైల్లో తీసిన వీడియో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడటానికి బ్లాక్మెయిల్ చేయాలనే యోచనే ప్రధాన కారణమని తేలిందని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం, భారీ కుట్ర కోణం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని.. తమకెటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కాగా, మార్టిన్, పల్సర్ సుని తదితరుల పోలీసు కస్టడీ గడువు రేపటితో ముగియనుంది. -
నటి కేసు: 'లై డిటెక్టర్ టెస్ట్ వద్దు'
కొచ్చి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునిల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ తమను తప్పుదోవ పట్టిస్తున్నాడని కేరళ పోలీసులు అంటున్నారు. శనివారం పల్సర్ సునీని అలువా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లై డిటెక్టర్ టెస్ట్ (నిజ నిర్ధారణ పరీక్ష) చేస్తేనే కేసు విచారణ త్వరగా పూర్తవుతుందని, లేనిపక్షంలో నిందితుడు సునీ పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు అలువా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కు విన్నవించారు. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించ వద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కోర్టులో పల్సర్ సునీ చెప్పాడు. కేరళ నటి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీపీ విగీష్, పల్సర్ సునీలకు పోలీస్ కస్టడీని మార్చి 10 వరకు కోర్టు పొడిగించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధం ఉన్న కొందరిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులకు ఆధారాలు సంపాదించడం సమస్యగా మారింది. నిందితుడు పల్సర్ సునీ నటిని కిడ్నాప్ చేసి కారులో తిప్పుడూ మరికొందరితో కలిసి తన స్మార్ట్ ఫోన్లో ఆమెను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. అయితే ఫోన్ వివరాలు మాత్రం వెల్లడించడక పోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ నెల 17న సినిమా షూటింగ్ నుంచి ఇంటికి బయలుదేరిన నటిని కొచ్చిలో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. నటిని దాదాపు 2 గంటలు కారులో బంధీగా తిప్పుతూ లైంగికంగా వేధిస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 23న పల్సర్ సునీ, విగ్నేష్ లతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
పల్సర్ సుని అరెస్టు: కోర్టులో హైడ్రామా
-
పల్సర్ సుని అరెస్టు: కోర్టులో హైడ్రామా
మళయాళ నటిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సుని అరెస్టు సమయంలో కొచ్చిలోని జిల్లాకోర్టు ప్రాంగణంలో హై డ్రామా చోటుచేసుకుంది. నిజానికి కేసు వెలుగులోకి వచ్చి ఆరు రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం పల్సర్ సునిని అరెస్టు చేయలేకపోయారు, అతడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కేసులో మరో నిందితుడైన విగీష్తో కలిసి లొంగిపోయేందుకు సునీ ఏసీజేఎం కోర్టుకు వచ్చాడు. మేజిస్ట్రేట్ భోజనానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పోలీసులు లోపలకు దూసుకొచ్చారు. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో పల్సర్ సుని, విగీష్ ఇద్దరూ కోర్టుకు వచ్చారు. అప్పటికి మేజిస్ట్రేట్ కుర్చీ ఖాళీగా ఉండటంతో పోలీసులు అప్పటికే నిందితుల బాక్సులో ఉన్న సునిని పట్టుకుని లాగేశారు. అతడు వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సునీ కింద పడిపోగా.. పోలీసులు అతడిని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి కోర్టు బయట ఉన్న వ్యానులోకి తోశారు. పోలీసుల ప్రవర్తన పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు హంతకుడు కావచ్చు, రేపిస్టు కావచ్చు గానీ.. కోర్టుకు మాత్రం అతడిపై నేరం రుజువయ్యేవరకు కేవలం నిందితుడు మాత్రమేనని, కోర్టు నుంచి నిందితులను లాక్కెళ్లే హక్కు పోలీసులకు లేదని న్యాయవాదులు అన్నారు. ఇప్పుడు సుని, విగీష్లను అలువాలోని పోలీసు క్లబ్ వద్ద ప్రశ్నిస్తున్నారు. -
నటి కేసు: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
కొచ్చి: ప్రముఖ మలయాళ నటి అపహరణ, దాడి కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సుని గురువారం కోర్టులో లొంగిపోయాడు. తన అనుచరుడు విజేశ్ తో కొచ్చి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సరెండర్ అయ్యాడు. కోర్టు వెలుపల భారీగా సంఖ్యలో ఉన్న పోలీసులు న్యాయమూర్తి చాంబర్ లోకి వచ్చి నిందితులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. నిందితుల తరపు న్యాయవాదులను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు లాగిపడేశారు. తర్వాత నిందితులను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. లొంగిపోవడానికి వచ్చిన నిందితులను బయటకు లాక్కెళ్లి, అరెస్ట్ చేయడంపై డ్యూటీ మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేస్తామని సునీల్ తరపు న్యాయవాది తెలిపారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై విచారణను కేరళ హైకోర్టు మార్చి 3కు వాయిదా వేసింది. నటిపై దాడి వెనుక సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే సునీల్ ముఠాతో ఈ దారుణం చేయించినట్టు తెలుస్తోంది. దాడి వెనుకున్న వారిని కూడా వదిలిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నటి కేసు: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
-
నటి కేసు: ఎఫ్ఐఆర్లో ఏముందో తెలుసా?
కొచ్చి: కదులుతున్న కారులో ప్రముఖ మలయాళ కథానాయికను లైంగికంగా వేధించిన ఘటనలో.. వాస్తవంగా ఏం జరిగిందనే దానిపై అనేక కథనాలు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)లో ఏం పేర్కొన్నారనేది కీలకంగా మారింది. ఎఫ్ఐఆర్ను ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం ఘటన జరిగిన క్రమం ఇది.. త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్ ముగించుకొని నటి సాయంత్రం ఏడు గంటలకు ఎస్‌యూవీలో బయలుదేరింది. ఈ ఎస్‌యూవీని ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్ క్రియేషన్స్ సమకూర్చింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమె బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలోనే కారు డ్రైవర్ మార్టిన్ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్ ఇచ్చిన సమాచారంతో పల్సర్ సుని గ్యాంగ్ క్యాటరింగ్ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది. ఉద్దేశపూర్వకంగా రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్పోర్ట్ జంక్షన్లో ఆమె వావానాన్ని ఆ కిరాయిమూక తమ వ్యాన్‌తో ఢీకొట్టింది. నటి కారు ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. నటిని బలవంతంగా నోరు మూసి వారు ముందుకు కదిలారు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు. వారు రూట్ మార్చి.. వాహనాన్ని ఓ ఇంటి ముందు ఆపారు. అక్కడి నుంచి ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునిల్ కుమార్ రంగంలోకి వచ్చాడు. ముఖానికి టవల్ కట్టుకొని వచ్చిన అతను డ్రైవర్ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్ వ్యాన్‌లోకి ఎక్కాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటితో అతను చెప్పాడు. కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన అనంతరం ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. నటి అక్కడి నుంచి నేరుగా తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా దర్శకుడు లాల్ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రూ. 30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే జరిగిన ఘటన తాలుకు వీడియోలు, ఫొటోలు బయటపెడతానని పల్సర్ సుని హెచ్చరించినట్టు ఆమె తెలిపింది. అంతేకాదు తనకు సహకరించకుంటే డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి మరింత వేధిస్తానని కూడా అతను బెదిరించినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సినీ పరిశ్రమలోని వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికే హీరోయిన్‌పై కిరాయి మూకతో ఈ అఘాయిత్యాన్ని చేయించారని, సినిమా వాళ్ల తరఫున పల్సర్ సుని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతాడని ఎమ్మెల్యే పీటీ థామస్ మీడియాకు తెలిపారు. -
నటిపై అఘాయిత్యం: పక్కా స్కెచ్ వేసింది అతనే!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు నిందితుల్లో ఒకడైన మణికందన్ పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ నేరానికి పక్కా స్కెచ్ గీశాడని, పూర్తిగా అతని ప్లాన్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని అతను తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాధితురాలి మాజీ డ్రైవర్ అయిన అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేరంలో పల్సర్ సునికి సహకరించిన మణికందన్‌ను సోమవారం రాత్రి పాలక్కడ్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నటి కారులోకి ప్రవేశించి దాడి చేసేవరకు.. పల్సర్ సుని ప్లాన్ గురించి తమకు తెలియదని చెప్పాడు. 'ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి పిలిచాడు. ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను. కానీ నటి మీద దాడి చేసేందుకు మమల్ని పిలిచాడని తర్వాత తెలిసింది. ఆమె కారులోకి మేం వెళ్లాక.. నేను మాత్రం తనపై దాడి చేయలేదు' అని అతను పోలీసులకు తెలిపినట్టు విశ్వనీయవర్గాలు తెలిపాయి. నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ నేరంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు పల్సర్ సునితో గొడవ పడ్డారని, వారికి రూ. 30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పాడు. మణికందన్ చెప్పింది పూర్తిగా పోలీసులు విశ్వసించడం లేదని సమాచారం. అతన్ని మరింతగా విచారించిన అనంతరం ఆ రోజు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. కాగా, నటిపై దాడి జరిగిన వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పోలీసులు అప్పగించారు. -
ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!
వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఓ సినీ ప్రముఖుడి హస్తం ఉందని అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ ఘటన వెనుక ప్రముఖ మలయాళ నిర్మాత అంటో జోసెఫ్ ప్రమేయమున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. నటి కిడ్నాప్, అత్యాచారం జరిగిన రోజు రాత్రి.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రౌడీ షీటర్ సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునితో జోసెఫ్ ఫోన్లో తరచూ మాట్లాడినట్టు పలు మీడియా చానెళ్లు తెలిపాయి. నిర్మాత జోసెఫ్ సహాయంతోనే పల్సర్ సుని తప్పించుకున్నట్టు వెల్లడించాయి. 'నిర్మాత అంటో జోసెఫ్‌ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు.. చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతే పల్సర్ సుని తన ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసినట్టు కాల్ రికార్డ్స్‌తోపాటు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు' అని సీనియర్ జర్నలిస్టు ఉల్లేక్ ఎన్పీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. ఈ కేసులో సినీ ప్రముఖుల హస్తముందని అనుమానాలు వెలువడటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ చెప్పారు. సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. నేరసామ్రాజ్యంతో సినీ చీకటి సంబంధాలు! ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచారం ఘటన నేపథ్యంలో కేరళ చిత్రపరిశ్రమకు, నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్సర్ సుని ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు, ఇతర సహా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగానే..మరోవైపు మాలీవుడ్‌తో నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి. నటులు, సినీ ప్రముఖులు తమ సొంత భద్రత కోసం నేరచరిత్ర కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్న సంగతి పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమేనని, భారీమొత్తంలో డబ్బుతో ప్రయాణించాల్సి ఉండటంతో క్రిమినల్స్‌ని నటులు తమ బాడీగార్గులుగా నియమించుకుంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చాలామంది ప్రముఖ నటులకు, సినీ పెద్దలకు క్రిమినల్స్ డ్రైవర్లుగా, బాడీగార్డులుగా ఉన్నారని ప్రముఖ న్యాయవాది హరీశ్ వాసుదేవన్ 'ఆసియా నెట్' చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. రౌడీషీటర్లు, నేరగాళ్లతో ప్రముఖ నటులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారిని తమ డైవర్లు, బాడీగార్డులుగా నియమించుకోవడమే కాదు.... ఏకంగా బహిరంగ కార్యక్రమాలు, అవార్డు వేడుకలకు వారితోపాటు హాజరవుతుంటారని చెప్పారు. భూముల కొనుగోళ్లు, మనీ లెండింగ్ వంటి వ్యవహారాల్లో నటులు నేరగాళ్ల సహాయం తీసుకుంటున్నారని తెలిపారు.