పల్సర్ సుని అరెస్టు: కోర్టులో హైడ్రామా
పల్సర్ సుని అరెస్టు: కోర్టులో హైడ్రామా
Published Thu, Feb 23 2017 3:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
మళయాళ నటిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సుని అరెస్టు సమయంలో కొచ్చిలోని జిల్లాకోర్టు ప్రాంగణంలో హై డ్రామా చోటుచేసుకుంది. నిజానికి కేసు వెలుగులోకి వచ్చి ఆరు రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం పల్సర్ సునిని అరెస్టు చేయలేకపోయారు, అతడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కేసులో మరో నిందితుడైన విగీష్‌తో కలిసి లొంగిపోయేందుకు సునీ ఏసీజేఎం కోర్టుకు వచ్చాడు. మేజిస్ట్రేట్ భోజనానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పోలీసులు లోపలకు దూసుకొచ్చారు. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో పల్సర్ సుని, విగీష్ ఇద్దరూ కోర్టుకు వచ్చారు. అప్పటికి మేజిస్ట్రేట్ కుర్చీ ఖాళీగా ఉండటంతో పోలీసులు అప్పటికే నిందితుల బాక్సులో ఉన్న సునిని పట్టుకుని లాగేశారు. అతడు వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సునీ కింద పడిపోగా.. పోలీసులు అతడిని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి కోర్టు బయట ఉన్న వ్యానులోకి తోశారు. పోలీసుల ప్రవర్తన పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు హంతకుడు కావచ్చు, రేపిస్టు కావచ్చు గానీ.. కోర్టుకు మాత్రం అతడిపై నేరం రుజువయ్యేవరకు కేవలం నిందితుడు మాత్రమేనని, కోర్టు నుంచి నిందితులను లాక్కెళ్లే హక్కు పోలీసులకు లేదని న్యాయవాదులు అన్నారు. ఇప్పుడు సుని, విగీష్‌లను అలువాలోని పోలీసు క్లబ్ వద్ద ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement