ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు! | Questions rise about film industry links with criminals | Sakshi
Sakshi News home page

ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!

Published Tue, Feb 21 2017 9:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!

ఆ నటిపై అత్యాచారం వెనుక ఓ సినీ ప్రముఖుడు!

  • వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం

  • కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఓ సినీ ప్రముఖుడి హస్తం ఉందని అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ ఘటన వెనుక ప్రముఖ మలయాళ నిర్మాత అంటో జోసెఫ్‌ ప్రమేయమున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. నటి కిడ్నాప్‌, అత్యాచారం జరిగిన రోజు రాత్రి.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన రౌడీ షీటర్‌ సునీల్‌ కుమార్‌ అలియాస్‌ పల్సర్‌ సునితో  జోసెఫ్‌ ఫోన్‌లో తరచూ మాట్లాడినట్టు పలు మీడియా చానెళ్లు తెలిపాయి. నిర్మాత జోసెఫ్‌ సహాయంతోనే పల్సర్‌ సుని తప్పించుకున్నట్టు వెల్లడించాయి.

    'నిర్మాత అంటో జోసెఫ్‌ను ఇంకా పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు.. చివరిసారిగా అతనితో మాట్లాడిన తర్వాతే పల్సర్‌ సుని తన ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేసినట్టు కాల్ రికార్డ్స్‌తోపాటు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు' అని సీనియర్‌ జర్నలిస్టు ఉల్లేక్‌ ఎన్పీ ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. ఈ కేసులో సినీ ప్రముఖుల హస్తముందని అనుమానాలు వెలువడటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్‌ ఐజీ దినేంద్ర కశ్యప్‌ చెప్పారు. సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

    నేరసామ్రాజ్యంతో సినీ చీకటి సంబంధాలు!
    ప్రముఖ నటి కిడ్నాప్‌, అత్యాచారం ఘటన నేపథ్యంలో కేరళ చిత్రపరిశ్రమకు, నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్సర్‌ సుని ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడు, ఇతర సహా నిందితులు ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగానే..మరోవైపు మాలీవుడ్‌తో నేరసామ్రాజ్యానికి ఉన్న చీకటి సంబంధాలు చర్చనీయాంశమయ్యాయి.

    నటులు, సినీ ప్రముఖులు తమ సొంత భద్రత కోసం నేరచరిత్ర కలిగిన వ్యక్తులను నియమించుకుంటున్న సంగతి  పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమేనని, భారీమొత్తంలో డబ్బుతో ప్రయాణించాల్సి ఉండటంతో క్రిమినల్స్‌ని నటులు తమ బాడీగార్గులుగా నియమించుకుంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చాలామంది ప్రముఖ నటులకు, సినీ పెద్దలకు క్రిమినల్స్‌ డ్రైవర్లుగా, బాడీగార్డులుగా ఉన్నారని ప్రముఖ న్యాయవాది హరీశ్‌ వాసుదేవన్‌ 'ఆసియా నెట్‌' చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. రౌడీషీటర్లు, నేరగాళ్లతో ప్రముఖ నటులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారిని తమ డైవర్లు, బాడీగార్డులుగా నియమించుకోవడమే కాదు.... ఏకంగా బహిరంగ కార్యక్రమాలు, అవార్డు వేడుకలకు వారితోపాటు హాజరవుతుంటారని చెప్పారు. భూముల కొనుగోళ్లు, మనీ లెండింగ్‌ వంటి వ్యవహారాల్లో నటులు నేరగాళ్ల సహాయం తీసుకుంటున్నారని తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement