కేరళ రాష్ట్రం రిలీజ్ చేసిన హేమా కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలనూ కుదిపేస్తోందనే చెప్పాలి. ఇంతకు ముందు దగా పడ్డ నటీమణులు ఇప్పుడు తమ ఆవేదనను వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాధికా శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్ సమయంలో క్యారవేన్‌లో రహస్య కెమేరాలు అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్‌ఫోన్‌లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది.
నేను క్యారవేన్‌కు వెళ్లకుండా హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్‌చార్జ్‌ని ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేం అందరం అలా ఎదిగినవాళ్లమే.
ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమని అడుగుతారు. అంటే... జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్‌లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ‘ఉల్లొళుకు’ సినిమాలో ఊర్వశితో కలిసి పార్వతి బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. ‘పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుంది’ అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలానా ట్రీట్ చేసేది అనిపించింది’’ అన్నారు.
అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారని...
2018లో ‘మీటూ’లో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. ఒక వ్యక్తి... అతను జర్నలిస్ట్ కాదు... అతను నటీమణులు అవకాశాల కోసం అడ్జెస్ట్ అవుతారు అన్నట్లుగా మాట్లాడాడు. నడిగర్ సంఘమ్ జనరల్ సెక్రటరీ విశాల్‌కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను’’ అని ఘాటుగా స్పందించారు రాధిక.
Comments
Please login to add a commentAdd a comment