సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
చెన్నై: 230 మంది ప్రయాణికులతో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్ లైన్స్ విమానంలో గురువారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ విషయాన్ని గమనించిన పైలెట్ వెంటనే మలేసియా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వెంటనే భారత్లోని చెన్నై విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. సదరు విమానాన్ని దింపేందుకు చెన్నై విమానాశ్రయ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు.
దాంతో మలేసియా విమానం చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని చెన్నై అధికారులు సరి చేశారు. ఆ తర్వాత విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మలేసియా ఎయిర్ లైన్స్ విమానం సాంకేతిక లోపం ఏర్పడిన సమయంలో భారత గగన తలంపై ఉందని చెప్పారు.