మలేషియన్ పైలట్ భార్యను ప్రశ్నించనున్న ఎఫ్బీఐ
ఈనెల 8వ తేదీ నుంచి అదృశ్యమైపోయిన మలేషియన్ విమానం కేసులో.. ఆ విమాన పైలట్ భార్యను అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ప్రశ్నించబోతోంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా బహుశా ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉండొచ్చన్న కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆమెను ప్రశ్నించాలని ఎఫ్బీఐ నిర్ణయించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఫైజా ఖాన్ త్వరలోనే ఎఫ్బీఐ దర్యాప్తు ఎదుర్కొంటారని డైలీ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షాతో పాటు కో పైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ఇద్దరి నేపథ్యం గురించి తెలుసుకోడానికి మలేషియన్ పోలీసులు, అమెరికన్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు)
కెప్టెన్ షా వ్యక్తిగత జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అతడికి తన భార్యతో సంబంధాలేవీ లేవని, కేవలం పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారంతేనని ఆయన కుటుంబ మిత్రులు చెబుతున్నారు. ఇటీవల జైలుపాలైన ఓ విపక్ష నాయకుడికి కూడా ఈ పైలట్ గట్టి మద్దతుదారని అంటున్నారు. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం)
ఓ మహిళ తప్పుడు గుర్తింపు కార్డులతో ఓ మొబైల్ నెంబరు తీసుకుని, దాంతో విమానం బయల్దేరడానికి ముందు కెప్టెన్ షాతో రెండు నిమిషాల పాటు మాట్లాడిందని చెబుతున్న పోలీసులు.. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కెప్టెన్ జహారీ ఇంట్లో దొరికిన ఫ్లైట్ సిమ్యులేటర్ గురించి కూడా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందులోని వివరాలన్నింటినీ ఫిబ్రవరి 3వ తేదీనే డిలీట్ చేసేశారు. అందులో ఫ్లైట్ సిమ్యులేటర్కు సంబంధించిన గేమ్స్ను అతడు ఆడాడు. (మలేషియా విమానం మిస్టరీగా మిగలనుందా?)