ఈద్ పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత దీదీ రాష్ట్రంలోని మైనారటీ వర్గాలకు వరాల జల్లు కురిపించారు. నగరంలోని రెడ్ రోడ్డులో ముస్లిం సోదరులతో కలసి దీదీ శనివారం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ... రాష్ట్రంలోని మైనారటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ముస్లిం సోదరులకు మమత దీదీ హామీ ఇచ్చారు. అందులో భాగంగా మైనారటీ వర్గాలకు చెందిన చిన్నారులు, విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్యం, ఇతర ఉన్నత విద్యా రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
అందుకోసం మైనారటీ వర్గాలు ఉన్నత విద్యా అభ్యసించేందుకు రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. అలాగే వివిధ జిలాల్లోని మైనారటీలు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని మమత ఈ సందర్భంగా తెలిపారు. ముస్లిం సోదరులకు మమత ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.