మరదలి పెళ్లి కోసం.. ఫార్చూనర్ కారు చోరీ
తన మరదలికి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం డబ్బులు కావాలి. ఏంచేయాలో తెలియలేదు. దాంతో, తాను డ్రైవర్ గా పనిచేస్తున్న ఖరీదైన ఫార్చూనర్ కారునే ఎత్తుకెళ్లిపోయాడు. మహేష్ జివాచ్ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో జిమ్ కోచ్ అయిన సం దీప్ గోమ్స్ (35) వద్ద డ్రైవర్ గా పనిచేస్తాడు. తన మరదలి పెళ్లికి డబ్బులు సర్దడానికి వేరే దారిలేక తాను డ్రైవింగ్ చేసే రూ. 30 లక్షల విలువైన ఫార్చూనర్ కారును ఈనెల 11న ఎత్తుకెళ్లిపోయాడు. దాన్ని ఎలాగైనా అమ్ముకోవాలని రకరకాలుగా ప్రయత్నించాడు. అలహాబాద్ లో ఒకసారి, బిహార్ లో మరోసారి ప్రయత్నించాడు. ఎక్కడా కుదరలేదు. దాంతో దాన్ని టాక్సీలా మార్చి జనాల్ని తిప్పడం మొదలుపెట్టాడు.
గోమ్స్ వద్ద మహేష్ గత ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. 11వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అతడు తన బాస్ కు చెప్పకుండా కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి, మర్నాడు అంతా అతడికోసం ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. అతడు కూడా తనకు ఫోన్ చేయకపోవడంతో, అనుమానం వచ్చి ఫిర్యాదుచేశానని చెప్పారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా తన ఆచూకీ గమనిస్తారని, పాత సిమ్ కార్డు తీసేసి, కొత్త సిమ్ వేసుకున్నాడు. అయితే అతగాడి ఫోన్ ఐఎంఈఐ నెంబరు ద్వారా పోలీసులు ఆచూకీని పట్టేశారు. చివరకు ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.