టర్కీలో ఓ వ్యక్తి తాను కట్టుకున్న భార్యను కరెంటు షాక్ ఇచ్చి చంపుతూ.. ఆ ప్రక్రియ చేస్తుండగానే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. రెండోసారి కూడా ఆడబిడ్డకు జన్మనివ్వడం. అతడితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు అంతా అయ్యేవరకు వేచి ఉన్నారు తప్ప ఆ నేరాన్ని మాత్రం ఆపడానికి ప్రయత్నించకపోవడం ఇందులో మరో విశేషం. టర్కీలోని ఆగ్నేయ దియార్బకిర్ రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి (29) తన భార్య నిద్రపోతున్న సమయంలో ఆమె గెడ్డం కింద కరెంటు వైరు పెట్టి చంపేశాడు. ఆమెకు రెండో కూతురు పుట్టిన రెండోరోజే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పోలీసులకు, ఆ వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను వతన్ అనే వార్తాపత్రిక యథాతథంగా ప్రచురించింది. ఆ వివరాలివీ..
''నేను ఒకళ్లని చంపేశాను''.. అని ఆ వ్యక్తి పోలీసు ఆపరేటర్కు చెప్పాడు
''ఎవరిని చంపావు''.. అవతలి అధికారి అడిగాడు
''నేను నా భార్యను ఇప్పుడే చంపుతున్నాను''.. ఆ వ్యక్తి
''నువ్వు ఆమెను చంపేశావా, లేక చంపుతున్నావా?'' పోలీసు అధికారి
''ఆమె ఇంకా చనిపోలేదు. కానీ ఈ హత్య హలాల్ (ఇస్లాంలో ఆమోదయోగ్యం) అయితే నేను ఆమెను చంపుతున్నాను''.. ఆ వ్యక్తి
''ఆమెతో నీకు సమస్య ఏంటి?''.. పోలీసు అధికారి
''నేను నా భార్యను చంపుతున్నానని చెబుతుంటే, నువ్వు మాత్రం సమస్య ఏంటని అడుగుతావా? బాధతో అరుస్తోందని ఆమె నోరు మూసేశా''.. ఆ వ్యక్తి
అప్పటికి ఆ పోలీసుకు మెలకువ వచ్చి, ''సరే.. ఆగు. నేను ఓ యూనిట్ను పంపుతున్నాను'' అని చెప్పాడు.
కుర్దిష్ ప్రాంతంలో ఓ స్థానిక రెస్టారెంటులో వెయిటర్గా పనిచేస్తున్న నిందితుడికి ఇప్పటికే నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండోసారి కూడా కూతురికే జన్మనివ్వడంతో తట్టుకోలేని కోపం వచ్చి ఇలా చేసినట్లు డిఫెన్స్ న్యాయవాది కోర్టులో తెలిపారు. పైపెచ్చు, నిందితుడు నేరం మొత్తం చేసేవరకు ఫోన్లో మాట్లాడారు తప్ప పోలీసులు సరిగా స్పందించలేదన్నారు.
పోలీస్.. నా భార్యను చంపేస్తున్నాను!
Published Sat, Jun 7 2014 9:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM
Advertisement
Advertisement