హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తరచూ వేధిస్తోందని ఆమెను హత్య చేసిన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన కుమ్మరి లక్ష్మణ్ బీనా (49) 29 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేరు.
లక్ష్మణ్ ప్రస్తుతం ఐడీపీఎల్ సమీపంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి బీనా తరచూ లక్ష్మణ్‌తో గొడవపడుతూ ఉండేది. ఇంటి ఓనర్లతో సైతం తరచూ గొడవ పడుతుండటంతో అతను పలు మార్లు ఇళ్లు మారాల్సి వచ్చింది. కొంత కాలం క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఫ్రెండ్స్ కాలనీకి మకాం మార్చారు.
ఇటీవల వీరి మధ్య గొడవలు జరగడంతో బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు సైతం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న లక్ష్మణ్ మంగళవారం ఉదయం ఆమె మెడకు ఎలక్ట్రికల్ వైర్ బిగించి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment