వామ్మో.. వీడు మాములు దొంగ కాదు
న్యూఢిల్లీ: వ్యాపారంలో నష్టపోయిన ఢిల్లీ యువ వ్యాపారవేత్త వక్రమార్గం పట్టాడు. మింటూ కుమార్ (28) అనే బీసీఏ గ్రాడ్యుయేట్ ఓ కారును అద్దెకు తీసుకుని.. దాని యజమానిగా పేర్కొంటూ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. నకిలీ రికార్డులు తయారు చేసి ఓ వ్యక‍్తికి ఆ కారును అమ్మేశాడు. కాగా మింటూ అదే రోజు రాత్రి కొత్త యజమాని నుంచి డూప్లికేట్ తాళంతో కారును దొంగలించాడు. మింటూ ఇలాగే మోసం చేసి ఇదే కారును మరొకరికి అమ్మాడు. చివరకు మింటూ పథకం బెడిసికొట్టడంతో జైలుపాలయ్యాడు.
మింటూ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ కెప్టెన్. ఫరీదాబాద్లో వ్యాపారం నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో నేరాలబాట పట్టాడు. గతవారం ద్వారకా సెక్టార్కు చెందిన ఓ వ్యక్తి తన కారును దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారు రికార్డులు పరిశీలించగా, దాన్ని అమ్మిన వ్యక్తి, అసలు యజమాని కాదని అని తేలింది. ఇదే కారును ద్వారకా సెక్టార్లోనే మరొకరికి అమ్మినట్టు కనుగొన్నారు. పోలీసులు దర్యాప్తులో అసలు నిందితుడు మింటూ దొరికిపోయాడు. మింటూ మోసాలు విని సీనియర్ పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.