
అప్పటిదాకా పోరాటం ఆగదు: మందకృష్ణ
నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించేంత వరకు తమ పోరాటం ఆపబోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాదిగ, మాల, మహిళా ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 వ తేదీలోపు తెలంగాణలోని 10 జిల్లాల్లో టీఆర్‌ఎస్ మాదిగ, మాల ఎమ్మెల్యేలు, మహిళ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రోజుకో నియోజకవర్గం చొప్పున దీక్షలు చేపడుతామని తెలిపారు. అయినా స్పందించని పక్షంలో ఆగస్టు 1 నుంచి 100 రోజులపాటు దీక్ష చేపడతామని హెచ్చరించారు. దళితుల కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్‌పై ఎలాంటి అణిచివేతకు పాల్పడినా కేసీఆర్‌పై యుద్ధం చేపట్టేందుకు అయినా సిద్ధమేనని సవాల్ విసిరారు.