నాపై మీడియా కక్షగట్టింది.. ఓ సీఎం ఆరోపణ
మీడియా తనపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని, కేవలం ప్రతిపక్షాలు డబ్బులిస్తే వాళ్లు చెప్పిన వార్తలు మాత్రమే కవర్ చేస్తూ.. తనను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఓ ముఖ్యమంత్రి వాపోతున్నారు. ఆయనెవరో కారు.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్!! ఐఐటీ చదివి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ఇప్పుడు వార్తల కవరేజి గురించి ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు, ఏకంగా పాత్రికేయుల చదువు గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
''రిపోర్టర్ జీతం ఎంత? న్యూస్రీడర్కు ఎంత వస్తుంది? బహుశా 25 వేలు కావచ్చు. కానీ వాళ్లు చాలామంది డిగ్రీ చదివిన వాళ్లే. వాళ్లేమీ పెద్ద మేధావులు, ఆలోచనాపరులు కారు. తమకు అర్థమైనట్లు గానే వార్తలు రాసేస్తారు. గోవాలో పెయిడ్ న్యూస్ సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది. కథనం రాయాలంటే డబ్బులు తీసుకుంటారు'' అని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ వార్తా పత్రికలు నడుపుతోందో అందరికీ తెలుసని, ఆ పేపర్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతుందో కూడా తెలుసని అన్నారు. ఎవరైనా వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి రాసేటప్పుడు.. ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలన్నారు.