గోవా సీఎంగా పరీకర్ ప్రమాణం
మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం
⇒ రేపు అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశం
పణజి: గోవా పాలనా పగ్గాలు చేపట్టేందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించనున్న ఆయనతో రాజ్‌భవన్‌లో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. పరీకర్‌తోపాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్ బ్లాక్(జీఎఫ్‌పీ) నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.
బాంబే ఐఐటీలో చదివిన 61 ఏళ్ల పరీకర్ గోవా సీఎం కావడం ఇది నాలుగోసారి. పరీకర్ ప్రమాణంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టేసి, గురువారం బలపరీక్షకు ఆదేశించడం, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసినా ఫలితం లేకపోవడంతో పరీకర్ సీఎంకావడానికి మార్గం సుగమమైంది. ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, వెంకయ్య తదితరలు, ప్రముఖులు హాజరయ్యారు.
మెజారిటీ నిరూపించుకుంటా: పరీకర్
బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని, తమవైపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పరీకర్ తర్వాత విలేకర్లతో చెప్పారు. గోవాతనాన్ని నిలుపుకోవడం నా ప్రాధాన్యం. నెలలోపు ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంపై ప్రకటన చేస్తాం’ అని చెప్పారు.
కాంగ్రెస్ చివరి యత్నం..
పరీకర్ ప్రమాణానికి ముందు.. అధికారం కోసం చివరిక్షణంలోనూ కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. పెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎల్పీ నేత కవ్లేకర్ సహా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. తమకు మెజారిటీ ఉందన్నారు. తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని పార్టీ నేత లుయిజిన్హో ఫలేరియో విలేకర్లతో చెప్పారు. మీకు మెజారిటీ ఉందా అని ప్రశ్నించగా.. బలపరీక్షలో తేలుతుందని చెప్పారు. 40 స్థానాల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా, 13 సీట్లతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం తెలిసిందే.
మనోహర్ పరీకర్ ప్రస్థానం..
ఉత్తర గోవాలోని మపుసాలో మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యాపార కుటుంబంలో పరీకర్ జన్మించారు. పరీకర్ 1994లో తొలిసారి గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతోమోదీ ఏరికోరి పరీకర్‌ను మంత్రివర్గంలో చేర్చుకుని రక్షణ మంత్రి పదవిని అప్పగించారు. పరీకర్ ఆధ్వర్యంలోనే గోవా బాగా అభివృద్ధి చెందిందని..రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని రాష్ట్ర ప్రజలకు నమ్మకం కుదిరింది.
బలపరీక్షే పరిష్కారం
న్యూఢిల్లీ: పరీకర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది. పరీక్షతో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి పరిష్కారం లభిస్తుందని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం హోలీ సెలవు దినమైనా కోర్టు ప్రత్యేకంగా సమావేశమై గోవా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు సరిగ్గాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్‌కు చెప్పని కాంగ్రెస్‌దే తప్పు.
ప్రాంతీయ పార్టీల, స్వతంత్రుల మద్దతు అఫిడవిట్లను ఆ పార్టీ కోర్టుకు తీసుకురాలేదు.. ఇదంతా 30 సెకన్ల పని. రెండు రోజులుగా ఏం జరుగుతోందో తెలిసినా కాంగ్రెస్ పరీకర్‌ను కేసులో ఇంప్లీడ్ చేయలేదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది సంఖ్యాబలానికి సంబంధించిన విషయం’ అని పేర్కొంది. పరీకర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తమకు 21 మంది సభ్యుల మద్దతుందన్న బీజేపీ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ గవర్నర్.. పరీకర్‌కు రాసిన లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 16(గురువారం) ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని, సభ్యుల ప్రమాణం తర్వాత బలపరీక్ష జరపాలని గవర్నర్‌ను కోరింది.
అత్యంత సీనియర్ సభ్యుణ్ని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించాలని సూచించింది. అంతకుముందు కవ్లేకర్ తరపున సీనియన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను కాకుండా పరీకర్‌ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అత్యంత వివాదాస్పదం, వాస్తవ విరుద్ధమని ఆక్షేపించారు.ఆమె రాజ్యాంగ సంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ లేఖకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు.