పినపాక(ఖమ్మం): ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన దళ కమాండర్ దంపతులు ఖమ్మం జిల్లా ఏడూళ్లబయ్యారం పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏవోబీ సరిహద్దుల్లో మావోయిస్టు దళంలో కీలకంగా పనిచేసిన పాండ్రు అలియాస్ మనోజ్ అలియాస్ నితిన్ అతని భార్య అనితతో పాటు రెండు రోజుల క్రితం ఏడూళ్లబయ్యారం పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అయిదు నెలల క్రితమే పార్టీని వీడి సామాన్య జీవితం గడుపుతున్న పాండ్రు దంపతులు లొంగుబాటు యత్నంలో ఉండగానే పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
తొమ్మిదేళ్లు అజ్ఞాతంలో..
విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పాండ్రు మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగాడు. బాలబడి, ఏఓబీ సరిహద్దుల్లో రక్షక్ దళంలో, లోకల్ గెరిల్లా దళంలో, స్పెషల్ గెరిల్లా దళంలో సభ్యుడిగా, కమాండర్‌గా పని చేశాడు. మావోయిస్టు గ్రూపుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొమ్మిదేళ్లు కొనసాగాడు. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తయారు చేసే ప్రిటింగ్ ప్రెస్‌లో పుస్తకాలు, కర పత్రాలు, తదితర పుస్తక సామగ్రిని మూడు రాష్ట్రాల దళాలకు చేరవేసే బాధ్యతను నిర్వర్తించేవాడని తెలిసింది. ఈ క్ర మంలో దళసభ్యురాలిగా పనిచేస్తున్న అనితతో ప్రేమలో పడ్డాడు. అనిత దళ సభ్యురాలిగానే కాకుండా (జేఎన్‌ఎం) జననాట్య మండలిలో కీలక బాధ్యతలు నిర్వర్తించేదని తెలుస్తోంది. వీరిద్దరికి మధ్య ప్రేమ వ్యవహారం మావోయిస్టు హైకమాండ్‌కు తెలియడంతో వారు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై పోరు బాటను వీడినట్లు సమాచారం.
ఆయుధాలను దళ సభ్యులకు ఇచ్చి వారు అడివి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం మావోయిస్టు హైకమాండ్ వీరిని ప్రత్యేకంగా పిలిపించి చర్చలు కూడా జరిపారని తెలిసింది. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని వలస గొత్తికోయ గ్రామాల్లో పోలీసులకు, మావోయిస్టులకు తెలియకుండా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. వలస ఆదివాసీల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఏడూళ్ళ బయ్యారం సీఐ అంబటి నర్సయ్యను వివరణ కోరగా వలస గొత్తికోయ గ్రామాల్లో అనుమానితులను స్టేషన్ పిలిపించి ప్రశ్నించామని, తమ అదుపులో ఎవరూ లేరని తెలిపారు.
పోలీసుల అదుపులో మావోయిస్టు దంపతులు
Published Tue, Sep 8 2015 10:37 PM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM
Advertisement
Advertisement