maoist forces
-
ఛత్తీస్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని షెర్పర్–సీతాగోటా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను దారెకాస ఏరియా కమిటీ కార్యదర్శి సుఖ్‌దేవ్, అతని భార్య, ఏరియా కమిటీ సభ్యురాలు ప్రమీల, సీమా, మీనా, రితేష్, లలిత, శిల్పలుగా గుర్తించారు. మావోల కాల్పుల్లో ఆశారామ్ అనే జవానుకు గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు వెల్లడించారు. జూలై 28 నుంచి ఈ నెల 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలునిర్వహించిన నేపథ్యంలో పోలీసు బలగాలు దండకారణ్యంలో భారీ కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో డీఆర్జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్) బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టు దళం ఎదురుపడింది. ఈ క్రమంలో బలగాలకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిపిన అనంతరం మావోలు అడవుల్లోకి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ డీఎం అవస్థి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఏకే 47, 303 రైఫిల్, కార్బన్ గన్, 12 బోర్ గన్లు ఉన్నాయి. మావోలను హతమార్చడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రశంసించారు. -
విశాఖ సరిహద్దులో కాల్పుల కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్‌ను, 15 కిట్ బ్యాగ్‌లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, పర్ణశాల: మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న సానుభూతిపరులైన ఏడుగురిని బుధవారం అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించినట్టు ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు... మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామ శివారులోని తాటివారిగూడెం వెళ్లే దారి మధ్యన ఆటోలో ఏడుగురు వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమను చూసి ఆటోలో పారిపోతున్న ఆ ఏడుగురిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని, దుమ్ముగూడెం మండలంలోని దబ్బనూతల గ్రామస్తులు సొందె రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, బూర్గంపాడు మండలం వుడ్ యార్డ్ లక్ష్మీపురం గ్రామస్తుడు ఊకం శ్రీను, ఏపీలోని చింతూరు మండలం పోతనపల్లి గ్రామస్తుడు మడకం చిన్నబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామస్తుడు బిందాని దమన్ అలియాస్ ధర్మ, ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామస్తుడు కొండ్రు జగదీష్గా గుర్తించారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. పాల్వంచ మండలంలోని తోగ్గూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం నుంచి మావోయిస్టులకు వీటిని సరఫరా చేస్తున్నట్టుగా వారు అంగీకరించారు. వీరి నుంచి పది ఎక్స్‌పోసివ్ బూస్టర్లు, పది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, 300 మీటర్ల డీఎఫ్ వైర్, ఆటో (టీఎస్28 టీ0208) స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేశారు. వారిని ఖమ్మం కోర్టుకు అప్పగించారు. కేసును చర్ల సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో తప్పిన ప్రమాదం
-
చత్తీస్‌గఢ్‌లో తప్పిన పెను ప్రమాదం
వరంగల్: చత్తీస్‌గఢ్‌లో పెను ప్రమాదం తప్పింది. సుకుమా- నారాయణపూర్ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను పోలీసులు గుర్తించారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పాతిపెట్టిన 10 ల్యాండ్మైన్లను వెలికితీసి అనంతరం నిర్వీర్యం చేశారు. మూడు రోజుల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్ పేల్చి నలుగురు జవాన్లను బలితీసుకున్న సంగతి తెల్సిందే. ఎన్నికల వేళ తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననని దండకారణ్యంలోని ఏజెన్సీ గ్రామాల్లో అలజడి నెలకొంది. -
అడవిలో అలజడి !
సాక్షి, భద్రాచలం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సమయంలో సరిహద్దు అటవీ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడి పరి«స్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఏపీలోని అరకు ప్రాంతంలో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో గల బేస్ క్యాంప్‌లకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భద్రాచలం ప్రాంతంలో గగన తలంలో హెలీకాప్టర్లు తరచూ చక్కర్లు కొడుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. భద్రాచలంలోని టుబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్‌ను సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోనే ఉంచుకోవటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ నుంచే హెలీకాప్టర్ల ద్వారా పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలను అటవీ ప్రాంతాల్లో ఉన్న బేస్ క్యాంప్‌లకు తరలించడంతో పాటు, అక్కడ విధులు పూర్తి చేసుకున్న వారిని తిరిగి బెటాలియన్లకు తీసుకొస్తున్నారు. తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్న పైడిగూడెం, ధర్మపేట, ఎలకనగూడెం, తోగ్గూడెం, చెలిమల బేస్ క్యాంప్‌లకు భారీగానే బలగాలను పంపిస్తున్నారు. ప్రెషర్ బాంబులతో పోలీసులకు దడ.. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో తిప్పాపురం వెళ్లే దారిలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను నాలుగు రోజుల క్రితం పోలీసులు గుర్తించి వెలికితీశారు. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న రహదారులపై ఇటీవల ఏదో ఒక చోట మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబులు బయటపడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నికల సమయంలో భారీ విధ్వంసాలు సృష్టించి పైచేయి సాధించాలనే పక్కా వ్యూహంతో మావోయిస్టులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయని సమాచారం. పోలీసులు తరచూ కూంబింగ్‌కు వచ్చే రహదారులను గుర్తించిన మావోలు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా మందుపాతరలను అమరుస్తున్నారు. ఏపీలో విలీనమైన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి మల్లంపేటకు, చర్ల మండల కేంద్రం నుంచి తిప్పాపురం మీదగా భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీ, కొత్తపల్లి వరకు, దుమ్ముగూ డెం మండలం చిననల్లబెల్లి మీదుగా ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లే దారిలో ఎక్కువగా మందుపాతరలు బయట పడుతున్నాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని రహదారుల పక్కనున్న చెట్ల కింద, ఖాళీ ప్రదేశాల్లో మందుపాతరలు అమరుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లే పోలీసులు ఆచితూచి ముందడుగు వేయాల్సి వస్తోంది. అధునాతన టెక్నాలజీతో.. మందుపాతరల అమరికలో మావోయిస్టులు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వీటిని పేల్చేందుకు వంద డిటోనేటర్ల శక్తి కలిగిన కార్డెక్స్ అనే వైరును ఉపయోగించినట్లు ఇటీవలి ఘటనలతో పోలీసులు గుర్తించారు. చర్ల మండలంలోని తిప్పాపురం దారిలో ఒక్కొక్కటి పది కిలోల సామ ర్థ్యం గల మందుపాతరలను పెట్టగా పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఇవి పేలితే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని అంటున్నారు. ఇటీవల వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ వద్ద పేలిన మందుపాతరల వద్ద కూడా ఇలాంటి శక్తివంతమైన వైర్లు లభ్యమయ్యాయి. మందు పాతరలు అమర్చే క్రమంలో మావోలు సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు నిర్మించారు. కొన్నిచోట్ల పోలీసులే దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. అయితే వారు లేని సమయాల్లో అప్పుడే రహదారులపై మందుపాతరలు అమర్చి ఉంటారని నిఘా వర్గాలు అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విధ్వంసాలకు స్వస్తి పలికిన మావోయిస్టులు ఎన్నికల వేళ పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ప్రాణాంతక మందుపాతర్లను పేల్చే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో ఆయా రహదారుల్లో ప్రయాణించే గిరిజనులు సైతం ఆందోళన చెందుతున్నారు. దీనిపై మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై ఎటువంటి ప్రాణనష్టం కలుగకుండా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
బయ్యారం అడవుల్లో తుపాకుల మోత
పోలీసులు, న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) మధ్య కాల్పులు బయ్యారం: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి పంచాయతీలోని పందిపంపుల సమీప అడవుల్లో శనివారం సాయంత్రం తుపాకుల మోత మోగింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాం దోళనలకు గురయ్యూరు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన వరంగల్-ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్, కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి సాగర్ దళాలు సమీప గ్రామాల ప్రజలతో అటవీప్రాంతంలో సమావేశం అయ్యూయి. అనంతరం దళాలు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకొన్నాయి. నక్సల్స్ దళాలు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నాయి. దీంతో పోలీసులు సంఘటనా స్థలి సమీప గ్రామాలకు చెందిన పదిమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా నక్సల్స్ ఎజెండాను అమలు పరుస్తున్నామంటున్న ప్రభుత్వం నక్సల్స్‌పై పోలీసులతో కాల్పులు జరపించడం తగదని చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు దంపతులు
పినపాక(ఖమ్మం): ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన దళ కమాండర్ దంపతులు ఖమ్మం జిల్లా ఏడూళ్లబయ్యారం పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏవోబీ సరిహద్దుల్లో మావోయిస్టు దళంలో కీలకంగా పనిచేసిన పాండ్రు అలియాస్ మనోజ్ అలియాస్ నితిన్ అతని భార్య అనితతో పాటు రెండు రోజుల క్రితం ఏడూళ్లబయ్యారం పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అయిదు నెలల క్రితమే పార్టీని వీడి సామాన్య జీవితం గడుపుతున్న పాండ్రు దంపతులు లొంగుబాటు యత్నంలో ఉండగానే పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్లు అజ్ఞాతంలో.. విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పాండ్రు మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగాడు. బాలబడి, ఏఓబీ సరిహద్దుల్లో రక్షక్ దళంలో, లోకల్ గెరిల్లా దళంలో, స్పెషల్ గెరిల్లా దళంలో సభ్యుడిగా, కమాండర్‌గా పని చేశాడు. మావోయిస్టు గ్రూపుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తొమ్మిదేళ్లు కొనసాగాడు. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తయారు చేసే ప్రిటింగ్ ప్రెస్‌లో పుస్తకాలు, కర పత్రాలు, తదితర పుస్తక సామగ్రిని మూడు రాష్ట్రాల దళాలకు చేరవేసే బాధ్యతను నిర్వర్తించేవాడని తెలిసింది. ఈ క్ర మంలో దళసభ్యురాలిగా పనిచేస్తున్న అనితతో ప్రేమలో పడ్డాడు. అనిత దళ సభ్యురాలిగానే కాకుండా (జేఎన్ఎం) జననాట్య మండలిలో కీలక బాధ్యతలు నిర్వర్తించేదని తెలుస్తోంది. వీరిద్దరికి మధ్య ప్రేమ వ్యవహారం మావోయిస్టు హైకమాండ్‌కు తెలియడంతో వారు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై పోరు బాటను వీడినట్లు సమాచారం. ఆయుధాలను దళ సభ్యులకు ఇచ్చి వారు అడివి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అనంతరం మావోయిస్టు హైకమాండ్ వీరిని ప్రత్యేకంగా పిలిపించి చర్చలు కూడా జరిపారని తెలిసింది. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని వలస గొత్తికోయ గ్రామాల్లో పోలీసులకు, మావోయిస్టులకు తెలియకుండా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. వలస ఆదివాసీల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఏడూళ్ళ బయ్యారం సీఐ అంబటి నర్సయ్యను వివరణ కోరగా వలస గొత్తికోయ గ్రామాల్లో అనుమానితులను స్టేషన్ పిలిపించి ప్రశ్నించామని, తమ అదుపులో ఎవరూ లేరని తెలిపారు.