సాక్షి, భద్రాచలం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ సమయంలో సరిహద్దు అటవీ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడి పరి«స్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఏపీలోని అరకు ప్రాంతంలో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో గల బేస్ క్యాంప్‌లకు పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భద్రాచలం ప్రాంతంలో గగన తలంలో హెలీకాప్టర్‌లు తరచూ చక్కర్లు కొడుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. భద్రాచలంలోని టుబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్‌ను సీఆర్‌పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోనే ఉంచుకోవటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ నుంచే హెలీకాప్టర్‌ల ద్వారా పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలను అటవీ ప్రాంతాల్లో ఉన్న బేస్ క్యాంప్‌లకు తరలించడంతో పాటు, అక్కడ విధులు పూర్తి చేసుకున్న వారిని తిరిగి బెటాలియన్‌లకు తీసుకొస్తున్నారు. తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్న పైడిగూడెం, ధర్మపేట, ఎలకనగూడెం, తోగ్గూడెం, చెలిమల బేస్ క్యాంప్‌లకు భారీగానే బలగాలను పంపిస్తున్నారు.
ప్రెషర్ బాంబులతో పోలీసులకు దడ..
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో తిప్పాపురం వెళ్లే దారిలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను నాలుగు రోజుల క్రితం పోలీసులు గుర్తించి వెలికితీశారు. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న రహదారులపై ఇటీవల ఏదో ఒక చోట మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబులు బయటపడుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నికల సమయంలో భారీ విధ్వంసాలు సృష్టించి పైచేయి సాధించాలనే పక్కా వ్యూహంతో మావోయిస్టులు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయని సమాచారం.
పోలీసులు తరచూ కూంబింగ్‌కు వచ్చే రహదారులను గుర్తించిన మావోలు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా మందుపాతరలను అమరుస్తున్నారు. ఏపీలో విలీనమైన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి మల్లంపేటకు, చర్ల మండల కేంద్రం నుంచి తిప్పాపురం మీదగా భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీ, కొత్తపల్లి వరకు, దుమ్ముగూ డెం మండలం చిననల్లబెల్లి మీదుగా ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లే దారిలో ఎక్కువగా మందుపాతరలు బయట పడుతున్నాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని రహదారుల పక్కనున్న చెట్ల కింద, ఖాళీ ప్రదేశాల్లో మందుపాతరలు అమరుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌కు వెళ్లే పోలీసులు ఆచితూచి ముందడుగు వేయాల్సి వస్తోంది.
అధునాతన టెక్నాలజీతో..
మందుపాతరల అమరికలో మావోయిస్టులు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వీటిని పేల్చేందుకు వంద డిటోనేటర్ల శక్తి కలిగిన కార్డెక్స్ అనే వైరును ఉపయోగించినట్లు ఇటీవలి ఘటనలతో పోలీసులు గుర్తించారు. చర్ల మండలంలోని తిప్పాపురం దారిలో ఒక్కొక్కటి పది కిలోల సామ ర్థ్యం గల మందుపాతరలను పెట్టగా పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఇవి పేలితే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని అంటున్నారు. ఇటీవల వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ వద్ద పేలిన మందుపాతరల వద్ద కూడా ఇలాంటి శక్తివంతమైన వైర్లు లభ్యమయ్యాయి. మందు పాతరలు అమర్చే క్రమంలో మావోలు సాంకేతిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గత రెండేళ్లలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు నిర్మించారు. కొన్నిచోట్ల పోలీసులే దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. అయితే వారు లేని సమయాల్లో అప్పుడే రహదారులపై మందుపాతరలు అమర్చి ఉంటారని నిఘా వర్గాలు అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విధ్వంసాలకు స్వస్తి పలికిన మావోయిస్టులు ఎన్నికల వేళ పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ప్రాణాంతక మందుపాతర్లను పేల్చే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో ఆయా రహదారుల్లో ప్రయాణించే గిరిజనులు సైతం ఆందోళన చెందుతున్నారు. దీనిపై మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమై ఎటువంటి ప్రాణనష్టం కలుగకుండా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment