అవరోధం 20,870 పాయింట్లు
దేశీయ స్టాక్ సూచీలు రెండు నెలల నుంచి 5 శాతం శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే సూచీలను శాసించే షేర్ల గమనం గత రెండేళ్ల ట్రెండ్‌కు భిన్నంగా సాగుతోంది. రెండు నెలల నుంచి సూచీల ర్యాలీ జరిగినపుడు ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు నేతృత్వం వహించడం లేదు. అలాగే బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ రంగాలకు చెందిన షేర్లు మార్కెట్‌ను పడదోయడం లేదు. రెండు సంవత్సరాల నుంచి అదేపనిగా క్షీణించిన లార్సన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, బీహెచ్‌ఈఎల్, ఎస్‌బీఐ ఓల్డ్ ఎకానమీ తదితర షేర్లు మూడు నెలల గరిష్టస్థాయిలో ముగియడం, ఈ రంగాలకు చెందిన మిడ్‌సైజ్ షేర్లు కొత్త కనిష్టస్థాయిల పతనానికి బ్రేక్ పడటం మార్కెట్లో వస్తున్న మార్పునకు సూచన. భారత్ మార్కెట్లో ఒడుదుడుకులు తగ్గాలన్నా, దేశీయ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగాలన్నా ఈ మార్పు మరి కొద్దివారాలు కొనసాగాల్సి వుంటుంది. అంటే... గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన క్యూ2 జీడీపీ డేటాతో సహా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ నెలలో రాబోయే వివిధ గణాంకాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సూచీలు హెచ్చుతగ్గులకు లోనైనా, పైన ప్రస్తావించిన మార్పు కొనసాగితే మన స్టాక్ మార్కెట్ టర్న్ ఎరౌండ్ అయినట్లే.
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినరీతిలోనే నవంబర్ 29తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలి అవరోధాల్ని అధిగమించినంతనే 20,820పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 574 పారుుంట్ల భారీలాభంతో 20,792 పాయింట్ల వద్ద ముగిసింది. దాంతో మూడువారాల డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడింది. అయితే సెన్సెక్స్ తిరిగి కొత్త గరిష్టస్థాయిని అందుకోవాలంటే 20,870 పాయింట్ల కీలక నిరోధస్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుంది. దీపావళినాటి 21,321 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి నవంబర్ 22నాటి కనిష్టస్థాయి 20,137 పాయింట్ల వరకూ జరిగిన 1,184 పాయింట్ల పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌స్థాయి అయినందున ఈ 20,870 స్థాయికి ప్రాధాన్యత వుంది. ఈ వారం 20,870 పాయింట్ల స్థాయిపైన ముగిస్తే వేగంగా 21,130 పాయింట్ల వద్దకు ర్యాలీ జరపవచ్చు. ఆపైన 21,320 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. తొలి అవరోధాన్ని దాటలేకపోతే 20,600 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే 20,350 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన మరోదఫా 20,137 పాయింట్లస్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ తక్షణ నిరోధం 6,201
నవంబర్ 29తో ముగిసినవారంలో 6,030 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురు, శుక్రవారాల్లో భారీ ర్యాలీ జరపడంతో 6,182 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 181 పారుుంట్ల లాభంతో 6,176 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం పాజిటివ్‌గా నిఫ్టీ ప్రారంభమైతే తక్షణ అవరోధం 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 6,201 పాయింట్ల వద్ద ఎదురవుతోంది. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే క్రమేపీ 6,290 పాయింట్ల వద్దకు చేరవచ్చు. 2008 జనవరి 8న సాధించిన 6,357 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని సూచీ చేరాలంటే 6,290 పాయింట్లపైన ముగియాల్సివుంటుంది. ఈ వారం క్షీణతతో మొదలైతే 6,112 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గతవారం గ్యాప్‌అప్‌స్థాయి అయిన 6,030 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయి దిగువన రెండు వారాలపాటు మద్దతునిచ్చిన 5,972 పాయింట్ల స్థాయే ప్రధానం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే మార్కెట్ మళ్లీ బేర్ క క్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం వుంటుంది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభమైన మొదటిరోజునే 6,000 స్ట్రయిక్ వద్ద పుట్ ఆప్షన్ బిల్డప్ 52 లక్షలను దాటినందున, సమీప భవిష్యత్తులో ఈ స్థాయి గట్టిమద్దతునివ్వవచ్చు.
-పి సత్య ప్రసాద్
మార్కెట్ పంచాంగం
Published Mon, Dec 2 2013 12:58 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement
Advertisement