ఈ తారాజువ్వులు కొంటారా? | Market experts are saying that there? | Sakshi
Sakshi News home page

ఈ తారాజువ్వులు కొంటారా?

Published Wed, Nov 11 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

ఈ తారాజువ్వులు  కొంటారా?

ఈ తారాజువ్వులు కొంటారా?

అందరికీ జనవరి... మనకైతే ఉగాది. కానీ స్టాక్ మార్కెట్  మదుపరులకు మాత్రం దీపావళే కొత్త సంవత్సరాది. దీపావళి నుంచి కొత్త సంవత్ మొదలవుతుంది. అందుకే ఆ రోజున ఒకవైపు దేశమంతా టపాకాయలు కాలుతుండగా... స్టాక్ మార్కెట్లోనూ కొద్దిసేపు తారాజువ్వలు, చిచ్చుబుడ్డిల్లాంటి షేర్లు హల్‌చల్ చేస్తాయి. కొద్దిసేపు జరిగే మూరత్ ట్రేడింగ్‌లో... మదుపరులంతా ఏవో కొన్ని షేర్లను కొని పెట్టుకుంటుంటారు. ఎందుకంటే ఆ రోజున కొనుగోలు చేయాలన్నది చాలామంది సెంటిమెంటు. సరే! మరి రాబోయే సంవత్సరం సంవత్ 2072లో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఏ షేర్లు తారాజువ్వల్లా పెకైగురుతాయి? మార్కెట్ నిపుణులు వీటిపై ఏమంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవటానికి పలువురు బ్రోకింగ్ నిపుణుల్ని ‘సాక్షి బిజినెస్’ సంప్రదించింది. వారి సిఫారసుల సమాహారమే ఈ దీపావళి స్పెషల్...  - సాక్షి, బిజినెస్ బ్యూరో
 
 
బ్రోకింగ్ సంస్థ: ఆనంద్‌రాఠీ రీసెర్చ్     
 
మార్చికి నిఫ్టీ టార్గెట్- 9,100
 కంపెనీల ఆదాయాల్లో సరైన వృద్ధి లేకపోవడంతో వచ్చే రెండు త్రైమాసికాల సూచీలు పరిమిత శ్రేణిలోనే కదులుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే మార్చి, 2016 నుంచి కంపెనీల ఆదాయాలు పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ లోగా నిఫ్టీ 9,100 స్థాయిని తాకవచ్చు. ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడులను ప్రోత్సహించడం, రక్షణ, రేవులు, రోడ్లు వంటి కీలకమైన ఇన్‌ఫ్రా రంగానికి పెట్టుబడులు పెంచడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి.
 
వెల్‌స్పన్ ఇండియా
ప్రస్తుత ధర:  738  లక్ష్యం: 1,020  వృద్ధి: 38%
ఎందుకంటే..?: దేశీయ హోమ్ టెక్స్‌టైల్ వ్యాపారంలో వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్స్‌లో వెల్‌స్పన్ ఇండియా ఒకటి. కంపెనీ ఉత్పత్తిలో 97 శాతం ఎగుమతులదే. భారీ విస్తరణ కార్యక్రమాల్లో ఉన్న ఈ కంపెనీ వచ్చే రెండేళ్ల ఆదాయంలో 19 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం.
 
అశోక్ లేలాండ్
ప్రస్తుత ధర: 89  లక్ష్యం: 130  వృద్ధి: 46%
ఎందుకంటే..?: దేశీయ వాణిజ్య వాహనాల తయారీలో రెండోస్థానంలో ఉంది. నిస్సాన్ , జాన్ డీర్‌తో కలసి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. మైనింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, ఆర్థిక వృద్ధిరేటు పుంజుకోనుండటంతో వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి.
 
దివాన్ హౌసింగ్

ప్రస్తుత ధర: 212  లక్ష్యం: 322  వృద్ధి: 52%
ఎందుకంటే..?: తక్కువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాల గృహరుణాలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ రంగం వేగంగా విస్తరిస్తుండటం.. 100 స్మార్ట్‌సిటీల్లో భాగంగా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటు, దిగొస్తున్న వడ్డీరేట్లు కలిసొచ్చే అంశాలు.
 
బ్రోకింగ్ సంస్థ: కార్వీ స్టాక్ బ్రోకింగ్
 
నిఫ్టీ లక్ష ్యం: 9,400

సంవత్ 2071 మదుపరులకు మిశ్రమ ఫలితాలిచ్చింది. ప్రథమార్థంలో లాభాలను అందించిన సూచీలు ద్వితీయార్థం వచ్చే సరికి ఆ లాభాలన్నీ వెనక్కు తీసేసుకున్నాయి. నిఫ్టీ నూతన గరిష్ఠ స్థాయికి చేరుకున్నా, ఆ తర్వాత పతనం మొదలై... చివరకు స్వల్ప నష్టాలతో ముగిసింది. ఈ పతనం 2016 జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడా పతనం ఆగకపోతే 2016 సెప్టెంబర్ వరకూ మార్కెట్లు నేల చూపులు చూసే అవకాశం ఉంది. జనవరి వరకు నిఫ్టీ 7,673 - 8,300 శ్రేణిలో కదులుతుందని అంచనావేస్తున్నాం. ఈ పతనం ఆగి నిఫ్టీ బుల్ కక్ష్యలోకి ప్రవేశిస్తే సంవత్ 2072లో గరిష్టంగా 9,400 మార్కును చేరుతుంది. గతేడాదిలాగే ఈ ఏడాదీ లార్జ్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్ షేర్లే ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయని అంచనా.
 
మార్క్‌సన్స్ ఫార్మా
ప్రస్తుత ధర: 97  లక్ష్యం: 155  వృద్ధి: 60%
 ఎందుకంటే..?: కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతున్న మిడ్‌క్యాప్ ఫార్మా షేరు ఇది. ఇటీవలి గరిష్ట స్థాయి రూ.115 నుంచి రూ.74 వరకు పడింది.  అక్కడి నుంచి మళ్లీ పటిష్టమైన ర్యాలీ చేస్తోంది. సాంకేతికంగా బుల్లిష్ ట్రెండ్‌కి నిదర్శనమిది.
 
టాటా ఎలెక్సీ

ప్రస్తుత ధర: 1,772  లక్ష్యం: 2,880  వృద్ధి: 63%
ఎందుకంటే..?: ఈ ఐటీ మిడ్‌క్యాప్ కంపెనీ గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తోంది. గత కొన్ని నెలలుగా రూ.1,555 - 2025 శ్రేణిలో కదులుతున్న ఈ షేరు స్ట్రాంగ్ బుల్ ట్రెండ్‌ను సూచిస్తోంది.
 
బ్లూస్టార్

ప్రస్తుత ధర: 352  లక్ష్యం: 525 వృద్ధి: 49%
 ఎందుకంటే..?: ఎయిర్‌కండీషన్ల వ్యాపారంలో ఉన్న బ్లూస్టార్ 2013 ఆగస్టులో కనిష్టంగా రూ.130కి వచ్చింది. అక్కడి నుంచి పెరుగుతూ వస్తోంది.  ఏడాది కాలంగా ఈ షేరు రూ. 300-370 శ్రేణిలో కదులుతోంది.
 
బోకింగ్ సంస్థ: వే 2 వెల్త్
 
కాక్స్ అండ్ కింగ్స్
ప్రస్తుత ధర: 252  లక్ష్యం: 480  వృద్ధి: 90%
 ఎందుకంటే..?: రెండేళ్ల క్రితం భారీగా పెరిగిన ఈ షేరు గడిచిన ఏడాది కాలంగా లాభాల స్వీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుత స్థాయి నుంచి మళ్లీ ర్యాలీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సాంకేతికాలు వెల్లడిస్తున్నాయి. రూ.263 స్థాయిని దాటితే కొనుగోళ్లు చేయమని సూచిస్తున్నాం.
 
 గోద్రెజ్ ప్రాపర్టీస్
 ప్రస్తుత ధర: 314  లక్ష్యం: 465  వృద్ధి: 48%
 ఎందుకంటే..?: చాలా నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. సాంకేతికంగా చూసినా ఈ కౌంటర్లో జరుగుతున్న దిద్దుబాటు చివరి దశకు వచ్చింది. గత కొంతకాలంగా రూ.303 స్థాయిలో గట్టి మద్దతును అందుకుంటోంది. ఈ స్థాయి వద్ద షేర్లను కొనుగోలు చేయొచ్చు.
 
 సింటెక్స్ ఇండస్ట్రీస్
 ప్రస్తుత ధర: 100  లక్ష్యం: 198  వృద్ధి: 98%
 ఎందుకంటే:    2008లో ఈ షేరు ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 310ను తాకిన తర్వాత కరెక్షన్ మొదలై 8 ఏళ్లు అయ్యింది. సాంకేతికంగా  చూస్తే... ఈ షేరు ప్రస్తుతం బుల్లిష్‌గా ఉంది. ఒక్కసారి రూ. 122 స్థాయిని అధిగమిస్తే వేగంగా రూ. 198 మార్కును అందుకునే అవకాశాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement