6,200 దిగువకు నిఫ్టీ
వరుసగా రెండో రోజుకూడా మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం 16 పాయింట్లు తగ్గిన నిఫ్టీ తాజాగా 41 పాయింట్లు కోల్పోయింది. వెరసి 6,200 దిగువన 6,161 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ కూడా వారం రోజుల్లో లేని విధంగా 146 పాయింట్లు క్షీణించి 20,709 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 3-1% మధ్య నీరసించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఫలితాల వెల్లడికి ముందుగానే ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపారు. ఈ నెలాఖరులో సమావేశంకానున్న ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీల ఉపసంహరణపై నిర్ణయాన్ని వెలువరించవచ్చునన్న అంచనాలు కూడా మార్కెట్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయని చెప్పారు. యూనిటెక్ 10% పతనం: నోయిడాలోని విలాసవంత హౌసింగ్ ప్రాజెక్ట్‌కోసం 2007లో ఎల్‌ఐసీ నుంచి రూ. 200 కోట్ల రుణాలపై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలతో యూనిటెక్ షేరు ఒక దశలో 15% వరకూ పతనమైంది. చివరికి 10% నష్టంతో రూ. 15.65 వద్ద ముగిసింది.
అక్టోబర్‌లో రుణ మార్కెట్ల జోష్
రూ. 7,280 కోట్లు సమీకరించిన కంపెనీలు
ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు అక్టోబర్‌లో రూ. 7,279 కోట్లను సమీకరించాయి. సెప్టెంబర్ నెలలో సమీకరించిన రూ. 3,847 కోట్లతో పోలిస్తే ఇవి 89% అధికం. అయితే వీటిలో రుణ(డెట్) మార్కెట్ల నుంచి అత్యధికంగా రూ. 7,195 కోట్లను సమీకరించగా, ఈక్విటీ షేర్ల అమ్మకం ద్వారా రూ. 84 కోట్లు మాత్రమే లభించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2013 -14) తొలి ఏడు నెలల(ఏప్రిల్-అక్టోబర్) కాలంలో కంపెనీలు సమీకరించిన మొత్తం రూ. 18,636 కోట్లకు చేరింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ప్రైమరీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రూ. 9,484 కోట్లను మాత్రమే సమకూర్చుకోగలిగాయి.