మరోసారి టాప్ లో మారుతి
ప్రముఖ దేశీ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మరోసారి సత్తా చాటింది. ఆగస్ట్ నెలలో ఆకర్షణీయ అమ్మకాలతో టాపర్ గా నిలిచింది. కార్ల తయారీ దిగ్గజం సుజుకి భారతదేశం లిమిటెడ్ ఆగస్టు విక్రయాలలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 132,211 యూనిట్ల (119.931 డొమెస్టిక్/ 12,280 ఎగుమతులు) ను విక్రయించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. గత ఏడాది 117,864 యూనిట్ల (106,781 / 11,083) గా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాల మొత్తం అమ్మకాలు 12.2 శాతం పెరిగి 1.3 లక్షల యూనిట్లను తాకాయి. వీటిలో దేశీ అమ్మకాలు 12.3 శాతం వృద్ధితో 1.19 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే 10.8 శాతం వృద్ధితో 12,280 యూనిట్లను ఎగుమతి చేసింది.
అలాగే యుటిలిటీ వాహనాల విక్రయాలు 114.5 శాతం వృద్ధితో16.806 యూనిట్లకు పెరిగాయి. మధ్యస్థాయి కార్ల సెగ్మెంట్ సియాజ్, కాంపాక్ట్ సెగ్మెంటో విభాగంలోస్విఫ్ట్, రిట్జ్, బాలెనో, సెలెరియో, డిజైర్ అమ్మకాలు కూడా వృద్ధి పొందాయి. అయితే ఆగష్టు 2015 అమ్మకాలు పోలిస్తే మారుతి సుజుకి దాని మినీ సెగ్మెంట్ లో మాత్రం కొద్దిగా తగ్గుదలనునమోదుచేసింది.వృద్ధిని ఆల్టో, వ్యాగన్ ఆర్, సూపర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో (డిజైర్ టూర్) గత నెలలో అమ్మకాలు క్షీణించాయి. వచ్చే మూడు నెలల పండుగ సీజన్, ఏడవ వేతన కమిషన్ సిఫారసులు అమలు, మంచి వాతావరణ పరిస్థితులు, తదితర కీలక అంశాల కారణంగా ప్రత్యేక మెడల్స్ లో డిమాండ్ మరింత పుంజుకునే అవకాశాలున్నాయని పార్ట్ నర్ వాటర్ హౌస్ కు చెందిన అబ్దుల్ మజీద్ తెలిపారు. డీజిల్ వాహనాలపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో యూజర్లు డీజిల్ తో పోలిస్తే.. పెట్రోల్ ఇంజీన్ కార్లవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో మారుతి స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది.
మరోవైపు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు మారుతి సుజుకి ఎండీ కెనిచి అయుక్వా తెలిపారు. దీపావళి కి ముందు మరిన్ని వాహనాలను డెలీవరీ చేయాల్సి ఉందన్నారు. మరో ఆరు నెలల్లో గుజరాత్ లోని తమ ప్లాంట్ రడీ అవనున్నట్టు ఆయన వెల్లడించారు. భద్రతా ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తే రాబోయేరెండేళ్లలో కార్ల ధరలుమరింత పెరుగుతాయని చెప్పారు.