కొత్త నానో వస్తోంది...
సింగపూర్: నానో కారుకు కొత్త రూపు, ఇమేజ్‌ని ఇవ్వాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే సరికొత్త నానోను భారత్‌లో కాకుండా వేరే దేశ (బహుశా ఇండోనేిసియా) మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా చెప్పారు. చౌక కారు అన్న ముద్ర నానోకు ఉందని, దీనిని తొలగించేలా కొత్తగా నానోను ఇండోనేషియాలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత భారత మార్కెట్లోకి తెస్తామని వివరించారు. సరికొత్తగా మార్పులు, చేర్పులు చేసిన నానోను యూరప్ దేశాల్లో కూడా విక్రయిస్తామని తెలిపారు. నానో పట్ల ప్రపంచ దేశాల్లో మంచి ఆసక్తి నెలకొందని వివరించారు. సీఎన్‌బీసీ మేనేజింగ్ ఏషియా కార్యక్రమానికిచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు.
తప్పుగా మార్కెటింగ్: కొత్త నానో కోసం కసరత్తు జరుగుతోందని రతన్ టాటా చెప్పారు. నానో మార్కెటింగ్ విషయంలో చౌక కారు ప్రచారంతో తప్పు చేశామని ఆయన అంగీకరించారు. టూ-వీలర్ల మీద పిల్లలతో సహా ప్రయాణించే కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని, వారికి అందుబాటు ధరలో కారునందించాలనే ఉద్దేశంతో నానోను తెచ్చామని వివరించారు. అంతేకాని ఇది చౌక కారు కాదని పేర్కొన్నారు. టాటా మోటార్స్ ఎంతోగానే ఆశలు పెట్టుకున్న నానో కారు అమ్మకాలు నానాటికి తగ్గుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి 43,627గా ఉన్న నానో విక్రయాలు ఈ ఏడాది ఇదే కాలానికి 72 శాతం క్షీణించి 12,322కు చేరాయి. గత నెలలో కంపెనీ నానోలో సీఎన్‌జీ, పెట్రోల్ బయో ఫ్యూయల్ ఆప్షన్లలో వేరియంట్‌లను విడుదల చేసింది. లక్ష రూపాయల కారుగా ప్రారంభంలో ప్రచారం పొందిన నానో కారు ప్రస్తుత ధరలు రూ.1.45 లక్షల నుంచి రూ.2.65 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
పౌష్టికాహార లోపం పెద్ద సమస్య
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యువశక్తి అధికంగా ఉన్న భారత్ వంటి దేశానికి పౌష్టికాహార లోపం అనేది అతిపెద్ద సమస్య అని, దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ఇండియా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేవలం ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలపైనే ఆధారపడకుండా ప్రతీ ఒక్కరూ నడుంబిగించినప్పుడే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. పౌష్టికాహార సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటైన ‘ఇండియన్ ఇంపాక్ట్’ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను రతన్ టాటా, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీ.ఎం.రావులు ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు.