రాష్ర్టంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి సీఎం చంద్రబాబు రాచరిక పాలన కొనసాగిస్తున్నారని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి అణగదొక్కాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామర్శించిన అనంతరం అంబటి మాట్లాడుతూ ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాలతోనే పోలీసులు ఎమ్మెల్యేపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.
అధికార పార్టీ అక్రమ కేసులకు భయపడబోమని, వాటిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పోలీసుల వల్లనే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, కార్యకర్తలను భయాందోళనకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ఆరోపించారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ స్పీకర్ కోడెల అధికారులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని విమర్శించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులు ఎత్తివేసే వరకుపోరాడతామన్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను చిత్రీకరించిన సీడీ తమ వద్ద ఉందని, తప్పుడు కేసులు బనాయించడంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అక్రమకేసులకు బెదిరేది లేదు : అంబటి
Published Tue, Jan 19 2016 3:47 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement