ప్రజలకు అన్నీ చేదు జ్ఞాపకాలే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 సంవత్సరం మొత్తం ప్రజలకు చేదు జ్ఞాపకాలే మిగిల్చారని, చెప్పుకోవడానికి ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి అనేక తప్పిదాలు చేశారని, కొత్త ఏడాదిలోనైనా మంచి పాలన అందించాలని హితవు పలికారు. ఆయన గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...
ఈ ఏడాది కాల్‌మనీ, సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, ఇసుక మాఫియా, భూ మాఫియా ఇలా విజయవాడను వంద మాఫియాల కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన మహిళలు, పేదలకు వ్యతిరేకంగా కొనసాగుతోందని మండిపడ్డారు. మున్ముందు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో ఒకరికొకరు విమర్శలు చేసుకున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,కె.చంద్రశేఖర్‌రావులు ఇప్పుడు చెట్టాపట్టాలు వేసుకొని తిరగడంలో మతలబేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
శాసనసభ నుంచి మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు బహిష్కరించిన దుర్మార్గపు సంవత్సరంగా నిలిచిపోయిందన్నారు. పెంచిన జీతాలు ఇవ్వాలని అడిగిన అంగన్‌వాడీ టీచర్లను హింసించడంతోపాటు ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నాలు చేస్తుండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.