నేడే మెడికల్ కౌన్సెలింగ్
తెలంగాణలో మూడు, ఏపీలో ఒక కేంద్రం
ఏర్పాట్లు చేసిన జేఎన్‌టీయూ, ఎన్టీఆర్ వర్సిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసిన వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ కౌన్సెలింగ్ వచ్చే నెల 6 వరకు నిర్వహించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో జరిగే ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌ను తెలంగాణలో వరంగల్, హైదరాబాద్‌లోని 3 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఏపీలోని విజయవాడలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని ఏ కేటగిరీలో ఉన్న మొత్తం 50 శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్ కింద భర్తీ చేస్తారు. తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లోని 1,550 ఎంబీబీఎస్, 606 దంత వైద్య సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, ఉస్మానియాలోని పీజీఆర్‌ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లోని కాకతీయవర్సిటీలో, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి నిర్వహిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో రూ.10 వేలు...
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ప్రకారం ఫీజుల వసూలు చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీ ఎస్ కోర్సుకు వర్సిటీ ఫీజు కింద రూ. 7 వేలు, ప్రైవేటు కాలేజీల్లో రూ. 11,500 ఉంటుంది. ట్యూషన్ ఫీజు ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికి రూ. 10 వేల చొప్పున, ప్రైవేటులో ఏడాదికి రూ. 60 వేల చొప్పున ఉంటుంది. బీడీఎస్ కోర్సులకు ప్రభుత్వ కాలేజీల్లో వర్సిటీ ఫీజు రూ. 6 వేలు, ప్రైవేటులో రూ. 10,500 గా ఉంది. ఇక ట్యూషన్ ఫీజు ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికి రూ. 9 వేలు, ప్రైవేటులో రూ. 45 వేల చొప్పున వసూలు చేస్తారు. కౌన్సెలింగ్ ఫీజుగా ఓసీ, బీసీలకు రూ. 1,500, ఎస్సీ, ఎస్టీలు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.