ఆమె వెబ్‌సైట్ మూసివేత వెనుక.. ?
వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచమంతటా దుమారం రేపుతున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఇంటర్నెట్‌లోనూ ఆయన హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భార్య మెలీనియా ట్రంప్ వెబ్‌సైట్ అకస్మాత్తుగా ఇంటర్నెట్‌లో నుంచి మాయమైపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 22 నుంచి మెలీనియా వ్యక్తిగత, వృత్తిపరమైన వెబ్‌సైట్ అయిన ‘మెలీనియా ట్రంప్.కామ్’ కనిపించడం లేదు. ఈ సైట్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే.. ట్రంప్.కామ్‌కు రీడైరెక్ట్ అవుతోంది. ఒకప్పుడు సూపర్ మోడల్ అయిన మెలీనియా వ్యక్తిగత వెబ్‌సైట్ మూసివేయడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యక్తిగత వెబ్‌సైట్‌లో మెలీనియా తాను స్లోవెనియా యూనివర్సిటీ నుంచి డిజైనింగ్, అర్కిటెక్చర్‌లో డిగ్రీ పొందినట్టు తెలిపింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టినట్టు పేర్కొంది. అయితే, ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రథమ పౌరురాలి హోదా పొందనున్న మెలీనియా జీవితకథను గత ఫిబ్రవరిలో ఓ పత్రిక ప్రచురించింది. మెలీనియా చదువు మధ్యలోనే మానేసిందని, యూనివర్సిటీ డిగ్రీ ఆమెను పొందలేదని ఆ పత్రిక స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో మెలీనియా ఇంతకూ డిగ్రీ చదివిందా? లేక తనకు డిగ్రీ లేకున్నా ఉన్నట్టు ఇన్నాళ్లు వెబ్‌సైట్‌లో గొప్పలు చెప్పుకుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం వివాదాస్పదమవుతుండటంతో మెలీనియా డిగ్రీ రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఈ వెబ్‌సైట్‌ను మూసివేసినట్టు విమర్శకులు అంటున్నారు. మరోవైపు తన ప్రస్తుత వృత్తి, వ్యాపారాలకు అనుగుణంగా లేకపోవడంతోనే ఈ వెబ్‌సైట్‌ను మూసివేసినట్టు మెలీనియా ఓ ట్వీట్‌లో తెలిపింది.