సువిశాలమైన, 340 గదులున్న రాష్ట్రపతి భవన్‌లో కలాం ఐదేళ్లు ఉన్నారు.
జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాష్ట్రపతిభవన్ సిబ్బంది
న్యూఢిల్లీ: సువిశాలమైన, 340 గదులున్న రాష్ట్రపతి భవన్‌లో కలాం ఐదేళ్లు ఉన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అక్కడి సిబ్బందిపై చెరగని ముద్ర వేశారు. తాను దేశ ప్రథమ పౌరుడు... అయినా అటెండర్ నుంచి మొదలుకొని అందరినీ సమానంగా చూడటం కలాం గొప్పతనం. నిజానికి రాష్ట్రపతి భవన్‌లో ప్రొటోకాల్ చాలా పకడ్బందీగా అమలవుతుంది. ఎవరూ రాష్ట్రపతికి ఎదురుపడకూడదు. ఆయన పిలిస్తే తప్పితే... ఆయనున్న వైపు వెళ్లకూడదు. ఏది ఉన్నా సెక్రటరీలు చెబుతారు. మిగతా సిబ్బంది వాళ్లు చెప్పింది చేయాలంతే. అయితే కలాం ఇవేవీ పట్టించుకునేవారు కాదు. భద్రతా వలయాన్ని దాటుకొని సిబ్బంది క్వార్టర్ల వైపు వెళ్లేవారు.పిల్లలతో ముచ్చటించేవారు. ఆయన హయాంలో రాష్ట్రపతి భవన్‌లో పిల్లల సందడే ఎక్కువ. ఎంతటి వీవీఐపీలు ఉన్నా సరే... కలాం చిన్నారుల కోసం సమయం కేటాయించేవారు.
ఫలానాది వండమని చెప్పలేదు.. ‘కలాం దక్షిణాది ఆహారాన్ని ఇష్టపడేవారు. అయితే ఫలానా వంటకం చేయమని ఐదేళ్లలో ఆయన ఏ రోజూ కోరలేదు. ఆయన భోజనంలో రెండు వంటకాలే ఉండేవి. ఎప్పుడైనా మూడో డిష్ సిద్ధం చేస్తే... ఏంటీ విశేషం... ఈ రోజు ఏదైనా పండగా?‘ అని అడిగేవారని రాష్ట్రపతి భవన్‌లో 31 ఏళ్లుగా వంటమనిషిగా పనిచేస్తున్న అహ్మద్ చెప్పారు. ‘వంటకాల్లో ఉప్పు ఎక్కువైనా ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. పర్యటనలకు వెళ్లినపుడు ఎంత బిజీగా ఉన్నా... సిబ్బంది అంతా భోజనం చేశారా అని కనుక్కొనేవారు’ అని చెప్పారు.