మనవల కోసం ‘ఫండు’
మనవల కోసం ‘ఫండు’
Published Sun, Aug 11 2013 2:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
ఆయనో రైతు. షేర్లు, మార్కెట్ల గురించి పెద్దగా తెలియదు. అందుకని నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకపోయినా... ఆ షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాడు. ఓ అడ్వయిజర్‌ను విశ్వసించాడు. 18 ఏళ్ల కిందట రూ. 5వేలతో మొదలుపెట్టి... ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ మొత్తం ఎన్నో రెట్లు పెరిగింది. తక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ... దాన్ని వెనక్కి తీయకుండా మనవలకు ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన చెబుతున్న ఇన్వెస్ట్‌మెంట్ స్టోరీ ఇది...
నా పేరు ఎ.డి.రావు. మాది మహబూబ్‌నగర్ జిల్లా. రైతు కుటుంబం. నేనూ వ్యవసాయమే చేస్తుంటా. నాకు స్టాక్ మార్కెట్‌పై అంతగా అవగాహన లేదు. కాని మా బావమరిది వాళ్లంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. రైతును కావడంతో స్థిరమైన ఆదాయం లేదు. పంట ఎప్పుడు పండుతుందో... ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. పెపైచ్చు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేసే ఓపిక కూడా లేదు. డబ్బులున్నప్పుడు మాత్రమే ఎంతోకొంత వెనకేసుకోవాలి. ఇలా ఆలోచిస్తున్న తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు తెలిసింది. వీటికైతే షేర్లలాగా అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. పెపైచ్చు చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. తొలిసారి నేను 1995లో బిర్లాసన్‌లైఫ్-95 ఫండ్‌లో రూ.5,000 ఇన్వెస్ట్ చేశాను.
ఆ మొత్తం ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదు. ఈ 18 ఏళ్ళలో నేను ఇన్వెస్ట్ చేసిన రూ.5,000 కాస్త రూ.1,56,443కి చేరింది. ఆ ఫండ్‌పై వచ్చిన డివిడెండ్‌ను కూడా దాన్లోనే ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆ మొత్తం లక్షన్నర దాటింది. 2008లో మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఈ విలువ రూ.1.80 లక్షలు దాటింది. అప్పుడు వెనక్కి తీసుకోలేదు. అలా తీసుకోనందుకు, ఇప్పుడు విలువ తగ్గినందుకు నాకేమీ బాధ లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. కానీ ఈ మధ్య మార్కెట్లో నెలకొంటున్న తీవ్ర ఒడిదుడుకులు చూస్తుంటే కొంచెం ఆందోళనగానే ఉంది. అయినా ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చేతిలో వెయ్యి లేదా రెండు వేలు ఉంటే చాలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను.
పదేళ్లుగా హైదరాబాద్‌లోని మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ పి.సతీష్ సూచనలు తీసుకుంటున్నాను. కేవలం ఈక్విటీ ఫండ్స్‌పైనే దృష్టిపెట్టాను. వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తగినంత పోర్ట్‌ఫోలియోను రూపొందించుకున్నాను. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయడమే తప్ప ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకోలేదు. ఈ మొత్తాన్ని నా మనవళ్లకి ఆస్తిగా అందించాలన్నదే నా ఆశ. దీర్ఘకాలం వేచి చూస్తే ఈక్విటీలను మించి లాభాలను అందించే పథకం ఇంకోటి లేదని బలంగా నమ్మే వాళ్ళలో నేను ముందుంటాను. అలాగే ఈక్విటీలు, షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఉండాలని చాలామంది అపోహ పడతారు. చిన్న మొత్తాలతో కూడా సంపదను పోగేసుకోవచ్చనేది నా అభిప్రాయం.
ఇన్వెస్టర్ స్టోరీ
మీరు ఇన్వెస్టరా? మీరు మార్కెట్లో ఊహించని లాభాలు సంపాదించారా? లేక భారీ నష్టాలతో కుదేలయ్యారా? మంచో, చెడో... మీ కథ అందరికీ చెప్పాలనుకుంటున్నారా? మీ ఇన్వెస్ట్‌మెంట్
వివరాలను... ఫోటో, చిరునామాలతో మాకు పంపండి.
చిరునామా:
ప్రాఫిట్, సాక్షి తెలుగు దినపత్రిక
6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నంబర్1, బంజారా హిల్స్
హైదరాబాద్-34
ఈ-మెయిల్: business@sakshi.com
Advertisement