కడుపులో సూక్ష్మజీవులు తగ్గితే...
మన జీర్ణకోశం వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశికి నిలయం. ఎన్ని ఎక్కువ జాతుల సూక్ష్మజీవరాశి కడుపులో ఉంటే మన ఆరోగ్యం అంత చల్లగా ఉంటుందట! జీర్ణకోశంలోని సూక్ష్మజీవరాశిలో వైవిధ్యం అడుగంటినప్పుడు వ్యాధులు ముసురుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్-2) వంటి జబ్బులకు కారణం జీర్ణకోశంలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం బాగా తగ్గిపోవటమే! ఇంతకీ మన కడుపులో సూక్ష్మజీవుల వైవిధ్యం తగ్గడానికి కారణమేమిటి?
మనం తినే ఆహారంలో వైవిధ్యం తగ్గడమే. గత కొన్ని దశాబ్దాలుగా సాగు పద్ధతులు మారిపోవడం వల్ల పంటల్లో జీవవైవిధ్యం తగ్గింది. ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పన్నెండు రకాలే తింటున్నారు. దీనివల్ల వారి జీర్ణకోశాల్లో సూక్ష్మజీవుల వైవిధ్యం అడుగంటుతోంది.
అమెరికాలోని చికాగోకు చెందిన ఆహార సాంకేతిక సంస్థ(ఐఎఫ్‌టీ) ఉపాధ్యక్షుడు మార్క్ హైమన్ నిర్వహించిన తాజా పరిశోధనల ప్రకారం, దీర్ఘకాలంగా కొద్ది రకాల ఆహారాన్ని మాత్రమే తినడం ఊబకాయం, ప్రిడయాబెటిక్, టైప్ 2 మధుమేహం, జీర్ణకోశ వ్యాధులకు మూల కారణమని తేలింది. సూక్ష్మజీవరాశి గుళికలను కొందరికి ప్రయోగాత్మకంగా అందించినప్పుడు, వారి రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండి, మలబద్ధకం నుంచి సాంత్వన లభించింది. పాత(దేశీ) వంగడాల సాగు నిలిచిపోవడంతో ఈ ఆహారం తినడం మానుకున్న వారిలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడిందని కూడా హైమన్ అధ్యయనంలో తేటతెల్లమైంది. కాబట్టి, ఎక్కువ రకాల పంటలు కలిపి పండించడాన్ని ప్రోత్సహిద్దాం, వైవిధ్యభరితమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉందాం!