ల్యాండవుతూ.. అదుపుతప్పడంతో!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ విమానం మరోసారి ప్రమాదానికి గురయింది. మంగళవారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిగ్-21 అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి.. 200 మీటర్ల ఎత్తునుంచి పడిపోయింది. అయినా అదృష్టవశాత్తు ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జెట్ ఫైలట్ సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, మిగ్-21 ఎత్తులోనుంచి పడటం వల్ల రన్‌వే ధ్వంసమైంది. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాలను వెంటనే నిలిపివేశారు.
’ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దీనిని ల్యాండ్ చేశారు. దీనివల్ల జెట్ విమానం టైర్లు కాలి బూడిదైపోయాయి. అయితే సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల విమానానికి ఏమీ కాలేదు.’ అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి తగలబడుతున్న టైర్లను ఆర్పివేయడంతో విమానానికి మంటలు అంటుకోలేదు.