srinagar airport
-
ఉగ్రవాదులకు పోలీసు సాయం..
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్ కూడా కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు. దొరికారిలా.. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్ ఎస్పీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు. కీలక మిలిటెంట్లు హతం.. జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్ ఫయాజ్ లోనె , ఫైజాన్ హమిద్, అదిల్ బాషిర్ మిర్ అలియాస్ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏచూరి నిర్భందం
శ్రీనగర్ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్లో ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే మొహమ్మద్ యూసిఫ్ తరిగామితో పాటు ఇతర కార్యకర్తలను ఆయన కలుసుకునేందుకు వెళ్లారు. కానీ పోలీసులు ఏచూరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నారు. ఏచూరితో పాటు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కూడా నిర్భందించారు. ఈ ఘటనపై సీపీఎం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఉన్న మా పార్టీనాయకులను కలవకుండా ఇలా ఏచూరిని విమానాశ్రయంలోనే నిర్భందించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఒక ప్రకటనలో తెలిపింది. విమానం ఎక్కే ముందే నేను జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్‌మాలిక్‌ను పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరానని ఏచూరి ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని ఏయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్లనివ్వలేదని, భద్రతాకారణాల రిత్యా అనుమతి ఇవ్వడం కుదరదంటూ పోలీసులు అడ్డుకున్నారని’ తెలిపారు. కాగా కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు ఆపి వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఆజాద్‌కు చుక్కెదురు
శ్రీనగర్: కశ్మీర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు చుక్కెదురైంది. ఆజాద్‌తోపాటు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మీర్‌ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి వారు గురువారం శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా వారిని పోలీసులు నిలువరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరంలోకి అనుమతించేది లేదంటూ ఆయనను తిరిగి ఢిల్లీ పంపించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఓట్ల కోసం ఇటువంటి చర్యలను చేపడితే సహించబోమని రాజ్యసభలో కేంద్రాన్ని ఆజాద్ హెచ్చరించారు. -
కిక్కిరిసిన శ్రీనగర్ విమానాశ్రయం
శ్రీనగర్: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను నిలిపేసి యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ లోయ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని కోరిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. తీర్థయాత్రకు వచ్చిన వారు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఒక్కసారిగా శ్రీనగర్ విమానాశ్రయానికి క్యూ కట్టడంతో వారికి టికెట్లు దొరకడం లేదు. భారీగా తరలి వచ్చిన యాత్రికులతో విమానాశ్రయం కిక్కిరిసింది. శ్రీనగర్ నుంచి అదనపు విమానాలను నడపడానికి విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. రద్దీకి అనుగుణంగా జమ్మూకశ్మీర్ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్టారా ప్రకటించాయి. కశ్మీర్ లోయలో ఎన్నడూ ఇటువంటి భయాందోళనక వాతావరణం చూడలేదని పలువురు యాత్రికులు పేర్కొన్నారు. దాల్ సరస్సు వద్ద షికారా ఎక్కుతున్న పర్యాటకులు కశ్మీర్ లోయలో శాంతి పెంపోందించేందుకు సహకరించాలని, పుకార్లను నమ్మవద్దని జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. విద్యా సంస్థలను మూసివేయడానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో యథాతథంగా కొనసాగుతున్నాయి. కశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న భయాందోళన పరిస్థితుల్లో స్థానికులు నిత్యావసరాలను నిల్వ చేయడానికి స్టోర్స్, ఏటీఎంలు, ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. అంతేకాక పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది. శ్రీనగర్‌లో పెట్రోల్ బంక్ వద్ద ప్రజలు -
శ్రీనగర్‌లో ఉగ్రదాడి
శ్రీనగర్: శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న బీఎస్ఎఫ్ శిబిరంపై ఫిదాయీన్(ఆత్మాహుతి) దళం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు దాడి జరిపింది. కాల్పులు జరుపుకుంటూ వచ్చిన ముష్కరులు బీఎస్ఎఫ్ శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. జవాన్లు కూడా దీటుగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఇప్పటి వరకు ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన జవాన్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులను, ప్రయాణికులను, వాహనాలను ఎయిర్ పోర్టు దారిలోకి అనుమతించడం లేదు. అన్ని విమానసర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉ.11.30కి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జవాను అరెస్ట్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ జవాను గ్రెనేడ్లతో రావడం కలకలం సృష్టించింది. ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించే ఓ జవాను సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానం ఎక్కబోతున్న అతడ్ని పోలీసులు తనిఖీ చేయగా.. అతని బ్యాగులో రెండు గ్రెనేడ్లను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జవానును పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూపాల్ ముఖియాగా పోలీసులు గుర్తించారు. ఆ గ్రెనేడ్లను జవాను ఢిల్లీలోని ఓ వ్యక్తికి అప్పజెప్పేందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అటు ఆర్మీగానీ, ఇటు పోలీసులు గానీ అధికారికంగా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రెనేడ్లతో విమానాశ్రయానికి వచ్చిన జవాను అరెస్ట్
జమ్ము కశ్మీర్: శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం ఓ జవాను అరెస్ట్ అయ్యాడు. బ్యాగులో రెండు గ్రెనేడ్లతో విమానం ఎక్కేందుకు యత్నించిన ఆర్మీ జవాను భూపాల్ ముఖియాను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరీ సెక్టార్‌లోని ఎల్వోసీ(నియంత్రణ రేఖ) వద్ద విధులు నిర్వర్తిస్తున్న భూపాల్ శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సోమవారం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. సెక్యూర్టీ చెకింగ్‌లో భాగంగా జవాను బ్యాగు చెక్ చేస్తుండగా.. అందులో నుంచి రెండు గ్రెనేడ్లు బయటపడ్డాయి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఈ రోజు కూడా విమాన సర్వీసులు బంద్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు వరుసగా ఆరోరోజు కూడా అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు, వెలుతురులేమి కారణంగా మంగళవారం ఈ విమానాశ్రయంలో విమాన సర్వీసులను ఆపివేశారు. వాతావరణ పరిస్థితిలో మార్పు రాలేదని, దీంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు శ్రీనగర్ ఎయిర్ పోర్టు అధికారి శరద్ కుమార్ చెప్పారు. ఆరు రోజులుగా శ్రీనగర్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం మాత్రం విమానాలను పాక్షికంగా పునరుద్దరించారు. ఇక్కడికి కేవలం రెండు విమానాలు వచ్చి వెళ్లాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం, సోమవారం ఒక్క విమాన సర్వీసును కూడా నడపలేదు. ఈ రోజు కూడా రద్దు చేశారు. -
అక్కడి నుంచి అన్ని విమానాలు రద్దు
శ్రీనగర్: వరుసగా రెండో రోజు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో సోమవారం అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వెలుతురు మందగించడంతో విమానాలను రద్దు చేసినట్టు చెప్పారు. ప్రతికూల వాతావరణంతో ఆదివారం కూడా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు రోజు కూడా పలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించి విమాన సర్వీసుల పునరుద్దరణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో పొగమంచు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో విమాన ప్రయాణికులకు మరిన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు. -
ల్యాండవుతూ.. అదుపుతప్పడంతో!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఫైటర్ జెట్ విమానం మరోసారి ప్రమాదానికి గురయింది. మంగళవారం శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో మిగ్-21 అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా అదుపుతప్పి.. 200 మీటర్ల ఎత్తునుంచి పడిపోయింది. అయినా అదృష్టవశాత్తు ఎవరికీ ఏ గాయాలు కాలేదు. జెట్ ఫైలట్ సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే, మిగ్-21 ఎత్తులోనుంచి పడటం వల్ల రన్‌వే ధ్వంసమైంది. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాలను వెంటనే నిలిపివేశారు. ’ఫైటర్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా దీనిని ల్యాండ్ చేశారు. దీనివల్ల జెట్ విమానం టైర్లు కాలి బూడిదైపోయాయి. అయితే సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల విమానానికి ఏమీ కాలేదు.’ అని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి తగలబడుతున్న టైర్లను ఆర్పివేయడంతో విమానానికి మంటలు అంటుకోలేదు.