
శ్రీనగర్: కశ్మీర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు చుక్కెదురైంది. ఆజాద్‌తోపాటు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మీర్‌ను శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి వారు గురువారం శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా వారిని పోలీసులు నిలువరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరంలోకి అనుమతించేది లేదంటూ ఆయనను తిరిగి ఢిల్లీ పంపించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఓట్ల కోసం ఇటువంటి చర్యలను చేపడితే సహించబోమని రాజ్యసభలో కేంద్రాన్ని ఆజాద్ హెచ్చరించారు.